APSRTC ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త
ఆర్టీసీ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 13 Jan 2024 7:08 AM ISTAPSRTC ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త
ఆర్టీసీ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సర్వీసు నిబంధనల్లోని క్రమశిక్షణ చర్యలు, వాటిపై అప్పీళ్లు, సమీక్షలకు సంబంధించి ఉద్యోగుల డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ సర్వీసు నిబంధనలు సవరించింది. సెక్షన్-5ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారమే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. 2023 జూలై కంటే ముందు చేపట్టిన చర్యలకు ఈ సవరణ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో అధికారులు పేర్కొన్నారు.
ఉద్యోగులపై చర్యలకు సంబంధించి చార్జ్‌షీట్లను డిస్పోజ్ చేసేటప్పుడు ఉమ్మడి జిల్లా డిప్యూటీ సీటీఎంలను కమిటీ సభ్యులుగా చేర్చడం.. అలాగే అప్పీళ్లను డిస్పోజ్ చేసేటప్పుడు రివ్యూ అథారిటీలో ఉమ్మడి జిల్లా రీజనల్ మేనేజర్‌ను సభ్యుడిగా చేర్చడంతో పాటు ఆ పైస్థాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు మెర్సీ పిటిషన్‌ను పరిశీలించేందుకు అనుమతి ఉంటుంది. కాగా.. తాజా నిర్ణయంతో రెండేళ్లుగా అప్పీళ్లు, రివ్యూ అథారిటీ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ఊరట లభించినట్లు అయ్యింది. వీరి కేసుల సత్వర పరిష్కారానికి లైన్ క్లియర్ అయ్యింది.
ఇక 2023 జూలై 25 తర్వాత వచ్చిన కేసులకు మాత్రం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వేచి చూడాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెప్పారు. సర్వీసు నిబంధనలను సవరించడంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయా ఉద్యోగ సంఘం నేతలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.