అమరావతి: సొంత ఆటో డ్రైవర్లు, మోటార్ క్యాబ్ డ్రైవర్లూ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లలకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. వారికి ఏడాదికి 15 వేలు రూపాయలు ఆటో మిత్ర పేరుతో ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2025 _26 ఆర్థిక సంవత్సరానికి విధి విధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం టి కృష్ణ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వాహన మిత్ర పేరుతో 10 వేల రూపాయలు ఇవ్వగా.. కూటమి సర్కార్ ఆటో మిత్ర పేరుతో 15 వేలు రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది.
మార్గదర్శకాలు ఇవే..
లబ్ధిదారులు సొంత వెహికల్, తప్పనిసరి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. లబ్ధిదారులు తమ వెహికల్‌కు ఏపీ రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్, టాక్స్ చెల్లింపు పత్రాలను కలిగి ఉండాలి. 3, 4 చక్రాల సరుకు రవాణా వాహనాలకు పథకం వర్తించదు. లబ్ధిదారుడు తప్పని సరిగా ఆధార్, రేషన్ కార్డు కలిగి ఉండాలి. కుటుంబంలో ఒక వాహనదారుడికి మాత్రమే పథకం వర్తిస్తుంది. ఈ నెల 17 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ జరగనుంది. ఈ నెల 24 నాటికి దరఖాస్తలను పరిశీలించి లబ్ధిదారుల తుది జాబితాను ప్రభుత్వం సిద్ధం చేయనుంది. అక్టోబర్ 1న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయనుంది.