గోదావరి వరద బాధితులకు రూ.3వేలతో పాటు నిత్యావసరాలు
ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వరద పోటెత్తింది.
By Srikanth Gundamalla Published on 27 July 2024 7:12 AM IST
గోదావరి వరద బాధితులకు రూ.3వేలతో పాటు నిత్యావసరాలు
ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వరద పోటెత్తింది. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద కారణంగా ఎంతో మంది ఇళ్లలోకి నీరుచేరాయి. పలు గ్రామాలు నీటమునిగాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైతులు పంట నష్టపోయారు. అయితే.. గోదావరి వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలబడింది. గోదావరి వరద బాదిత కుటుంబాలకు రూ.3వేల చొప్పున నగదు అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే 25 కిలోల బియ్యంతోపాటు కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కిలో చొప్పున, ఒక లీటరు పామాయిలు కూడా తక్షణ సాయంగా అందజేస్తామని సీఎం చంద్రబాబు శుక్రవారం శాసనసభలో ప్రకటించారు.
ఇళ్లలోకి వరద నీరు చేరి, పునరావాస కేంద్రాల్లో ఉంటున్నవారందరికీ ఈ తక్షణ సాయం అందుతుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గోదావరి వరదల వల్ల ఆయా జిల్లాల్లో వాటిల్లిన నష్టాలపై సభలో చర్చించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఒక లక్షా 6 ఎకరాల్లో వరిపంట, 4,317 ఎకరాల్లో వరి నారుమళ్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 273 ఎకరాల్లో పంటలు ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఇలాంటి సమయంలో బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనీ.. అందుకే ఆర్తిక సాయంతో పాటు నిత్యవసర వస్తువులను అందిస్తున్నట్లు చెప్పారు సీఎం చంద్రబాబు. ఇక వరద నష్టాలను త్వరగా పూర్తి చేయించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనితలను ఆదేశించారు. జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి బాధితులకు అండగా నిలిచి పరామర్శించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
రాష్ట్ర శాసనసభ సమావేశాలు శుక్రవారం ముగిశాయి. మొత్తంగా ఆరు రోజులు జరిగిన సమావేశాల్లో సభా కార్యకలాపాలు 27 గంటల 22 నిమిషాలపాటు కొనసాగాయి. రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టగా ఆ రెండూ ఆమోదం పొందాయి.