GIS 2023: ఏపీ గురించి ప్రముఖ పారిశామ్రిక వేత్తలు ఏమన్నారంటే?

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ - 2023లో భారత్‌ పాటు పలు దేశాల పారిశ్రామికవేత్తలు హాజరై మాట్లాడారు.

By అంజి  Published on  3 March 2023 3:35 PM IST
Global investors summit, prominent businessmen

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొన్న ప్రముఖులు

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరం వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ - 2023 జరుగుతోంది. ఈ సదస్సుకు భారత్‌ పాటు పలు దేశాల పారిశ్రామికవేత్తలు హాజరై మాట్లాడారు.

- ఈ సమ్మిట్‌లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్‌ అంబానీ అన్నారు. పలు రంగాల్లో ఏపీ నంబర్‌ వన్‌గా మారుతున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో కీలక రంగాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయని, పలువురు అంతర్జాతీయ నిపుణులు ఏపీ నుంచే వచ్చారని పేర్కొన్నారు. నూతన భారతదేశ నిర్మాణంలో ఏపీ కీలకం కాబోతుందని అంబానీ అన్నారు.

- సెంచురీ ఫ్లైబోర్డ్స్‌ చైర్మన్‌ సజ్జన్‌ భజంకా మాట్లాడుతూ.. ఏపీలో అడుగుపెట్టిని మొదటి రోజు నుంచి మంచి సహకారం అందుతోందన్నారు. ఏపీలో తమ కంపెనీ మరింత విస్తరణకు సిద్ధంగా ఉందని తెలిపారు.

- ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందని అదానీ పోర్ట్స్‌ సీఈవో కరణ్‌ అదానీ చెప్పారు. ఏపీలో మౌలిక సదుపాయాలు బాగున్నాయన్నారు. 15 వేల మెగావాట్ల పవర్‌ ప్రాజెక్టు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

- ఏపీలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతున్నామని రెన్యూ పవర్‌ ఎండీ సుమంత్‌ సిన్హా తెలిపారు. ఏపీలో పర్యాటక రంగం అంతర్జాతీయ స్థాయిలో ఉందని ఒబెరాయ్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ అర్జున్‌ ఒబెరాయ్‌ అన్నారు. సీఎం జగన్‌ దార్శనికతతో తొందరగా అనుమతులు లభిస్తున్నాయని తెలిపారు.

- ప్రపంచానికి ఉత్తమమైన మానవ వనరులను ఏపీ అందిస్తోందని భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌ కృష్ణ ఎల్లా అన్నారు. ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని సమర్థవంతంగా వాడుకుంటే ఏపీలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. నైపుణ్యాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రశంసనీయన్నారు.

- ఏపీలో సంక్షేమ పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయని సియాంట్‌ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ఐటీ రంగంలో ఏపీ నిపుణుల పాత్ర ఆదర్శనీయమన్నారు. విద్యారంగంలో ఏపీ కృషి అమోఘమని, పలు రంగాల్లో సాంకేతిక పాత్ర వేగంగా జరుగుతోందన్నారు. అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన పథకాల ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని తెలిపారు. విశాఖలో మరిన్ని సేవలు విస్తరిస్తామని తెలిపారు.

- సీఎం జగన్‌ విజన్‌, దార్శనికత అద్భుతమని జీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ జీఎం రావు అన్నారు. ఏపీలో కనెక్టివిటీ బాగా పెరిగిందని, ఏపీ ప్రగతిలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఇన్వెస్టర్స్‌ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్‌ ఉందన్నారు.

- ఏపీలో జిందాల్‌ స్టీల్‌ భారీగా పెట్టుబడులు పెట్టనుందని నవీన్‌ జిందాల్‌ ప్రకటించారు. రూ.10 వేల కోట్ల పెట్టుబడిని నవీన్‌ జిందాల్‌ ప్రకటించారు. ఏపీ ప్రగతిలో భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఆర్థిక వృద్ధిలో ఏపీ నంబర్‌ వన్‌గా ఉందన్నారు.

- గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని టెస్లా కో ఫౌండర్‌ మార్టిన్‌ ఎబర్‌ హార్డ్‌ అన్నారు. గ్రీన్‌ ఎనర్జీ పట్ల ఏపీ ఆసక్తి ప్రశంసనీయంగా ఉందన్నారు. సుస్థిర అభివృద్ధి ప్రపంచానికి చాలా అవసరమని పేర్కొన్నారు.

- ఏపీ ప్రభుత్వ సహకారం మరువలేనిదని టోరే ఇండస్ట్రీస్‌ ఎండీ మసహిరో యమగూచి అన్నారు. పలు కీలక రంగాల్లో వెంటనే అనుమతులు లభిస్తున్నాయన్నారు.

- రాష్ట్ర అభివృద్ధిలో కియా తన పాత్ర పోషిస్తోందని కియా ఇండియా ప్రతినిధి కబ్‌ డోంగ్‌ లి అన్నారు. ప్రభుత్వ సహకారాలు కియా అభివృద్ధికి దోహదపడుతున్నాయని తెలిపారు. ఏపీలో కియా కార్యకలాపాలు సులువుగా కొనసాగిస్తోందని, ఏపీ ప్రభుత్వ మద్ధతు అమోఘమని అన్నారు.

- ఏపీలో నైపుణ్యమైన మానవ వనరులు ఉన్నాయని శ్రీసిమెంట్‌ చైర్మన్‌ హరిమోహన్‌ అన్నారు. జగన్‌ నాయకత్వంలో ఏపీ పరిశ్రమల హబ్‌గా మారిందన్నారు. కర్బన రహిత వాతావరణం కోసం ఏపీ ప్రభుత్వ కృషి ప్రశంసనీయమన్నారు. ఏపీ పారిశ్రామికీకరణలో శ్రీసిమెంట్‌ తనదైన పాత్ర పోషిస్తోందన్నారు. రూ.5 వేల కోట్లతో శ్రీసిమెంట్‌ పెట్టుబడులు పెట్టనుందని హరిమోహన్‌ ప్రకటించారు.

- ఆరోగ్య రంగంలో ఏపీ సర్కార్‌ కృషి అభినందనీయమని అపోలో హాస్పిటల్స్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రీతారెడ్డి అన్నారు. ఏపీ ప్రభుత్వంలో అపోలో పార్టనర్‌గా ఉండటం సంతోషంగా ఉందన్నారు. సమ్మిట్‌లో ఆరోగ్యశ్రీ పథకం ఆవిష్కర్త వైఎస్సార్‌ను ప్రీతారెడ్డి గుర్తు చేశారు. ఆరోగ్య శ్రీ పథకం ఇతర దేశాలకు విస్తరించిందన్నారు.

- పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని నాఫ్‌ సీఈవో సుమ్మిత్‌ బిదానీ తెలిపారు. ఏపీలో రోడ్‌ కనెక్టివిటీ, విద్యుత్‌ సౌకర్యాలు చాలా బాగున్నాయని తెలిపారు. ఇన్వెస్టర్స్‌ సదస్సు పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

Next Story