'సీడ్స్'లో మళ్లీ గ్యాస్ లీక్.. 150 మంది మహిళా కార్మికులకు అస్వస్థత
Gas leak at SEZ Atchutapuram leaves many workers sick.'సీడ్స్'లో మళ్లీ గ్యాస్ లీక్.. 150 మంది మహిళా కార్మికులకు అస్వస్థత
By తోట వంశీ కుమార్ Published on 3 Aug 2022 12:39 AM GMTఅనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్(ప్రత్యేక ఆర్థిక మండలి)లోని బ్రాండిక్స్ కంపెనీలో మరోసారి విషవాయువు కలకలం రేపింది. మంగళవారం బి షిఫ్టు మరో మూడు గంటల్లో ముగుస్తుందనగా గాఢమైన విషవాయువు విడుదలైంది. దీంతో ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న 150 మంది మహిళా కార్మికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పదులో సంఖ్యలో మహిళలు స్మృహ తప్పి పడిపోయారు. వెంటనే వారికి ప్రాథమికి చికిత్స అందించి సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అక్కడి నుంచి అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రికి, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు.
కాగా.. సీడ్స్ కంపెనీలో మరోసారి గ్యాస్ లీకైందని బ్రాండిక్స్ అపెరల్‌సిటీ పరిధిలో పనిచేసే ఇతర కార్మికులకు తెలియడంతో ఆందోళనకు గురయ్యారు. గతంలో జరిగిన ప్రమాదంపై అనకాపల్లి జేసీ కల్పనాకుమారి ఆధ్వర్యంలో నియమించిన నిపుణుల కమిటీ విచారించినా ఇంతవరకూ ప్రమాదానికి కారణాలు, విషవాయువు ఎక్కడ నుంచి విడుదలైందో ఇంకా చెప్పలేదని ఆరోపించారు.
ఈ ఏడాది జూన్ 3న ఇదే కంపెనీలో విషవాయువు లీకే 469 మంది మహిళాకార్మికులు తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.
మెరుగైన వైద్యం అందేలా చూడండి
ఈ ఘటనపై మంత్రి గుడివాడ అమర్నాథ్ అధికారులతో మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విషాద పట్నంగా మార్చేశారు .. లోకేష్
ఈ ఘటనపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి స్పందించారు. "జగన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడంలేదు. రెండు నెలల వ్యవధిలోనే రెండుసార్లు గ్యాస్ లీకేజ్ ఘటనలు జరిగాయంటే ప్రజల ప్రాణాల పట్ల ప్రభుత్వ లెక్క లేనితనం స్పష్టమవుతోంది. విశాఖపట్టణంలో జే గ్యాంగ్ కబ్జాలు, దౌర్జన్యాలు, ప్రమాదాలు, విషరసాయనాల లీకులతో ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నారు. ఎల్జీ పాలీమర్స్ మరణమృదంగం, సాయినార్ ఫార్మా విషాదం మరువకముందే, అచ్యుతాపురం సెజ్ సీడ్స్ కంపెనీలో రెండోసారి విషవాయువులు లీకై వందలమంది మహిళలు తీవ్ర అస్వస్థతకి గురి కావడం తీవ్ర ఆందోళన కలిగించింది. ఉపాధి కోసం వచ్చిన మహిళల ప్రాణాలు పోయినా ఫర్వాలేదు. కమీషన్లు నెలనెలా అందితే చాలన్నట్టుంది జగన్ రెడ్డి పరిపాలన. చనిపోయాక పరిహారం ఇవ్వడం కాదు సీఎం గారూ! వాళ్లు బతికేలా రక్షణ చర్యలు తీసుకోండి" అంటూ లోకేష్ మండిపడ్డారు.
విశాఖపట్టణంలో జే గ్యాంగ్ కబ్జాలు, దౌర్జన్యాలు, ప్రమాదాలు, విషరసాయనాల లీకులతో ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నారు.(2/4)
— Lokesh Nara (@naralokesh) August 2, 2022
ప్రభుత్వ పర్యవేక్షణ ఏమైంది : సోము వీర్రాజు
రెండు నెలల్లో రెండు సార్లు రసాయనాలు లీకయ్యాయని, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దుయ్యబట్టారు. పరిశ్రమలపై ప్రభుత్వం పర్యవేక్షణ విరమించుకుందా..? అని ప్రశ్నించారు.