విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ వద్దంటూ.. పునరుద్దరణ కోసం కీలకమైన సలహాలు, పరిష్కారాలతో ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జగన్ లేఖ రాయడాన్ని ఆహ్వానిస్తున్నానని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా జగన్ గురించి గంటా ట్వీట్ చేశారు.
సొంత ఇనుప ఖనిజం గనిని కేటాయించడం, రుణాలను ఈక్విటీ లుగా మార్చడం ద్వారా స్టాక్ ఎక్స్చేంజి లో నమోదై నిధుల సేకరణకు అవకాశం ఉండడం లాంటివి పరిష్కార మార్గాలు. ఇందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదములు తెలియచేస్తున్నాను. అయితే కేంద్రం ఇప్పటికే పాలసీ తీసుకున్నందున లేఖతో పాటు ముఖ్యమంత్రి జగన్ స్వయంగా వెళ్లి ప్రధానిని కలిసి వైజాగ్ స్టీల్ ఏర్పాటు ఉద్యమాన్ని సైతం వివరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
విశాఖ, తెలుగు ప్రజల మనోభావాలను వివరించి ప్రధాని మోదీని ఒప్పించాలని ట్విట్టర్ వేదికగా జగన్‌కు గంటా విజ్ఞప్తి చేశారు. అంతేకాదు.. అవసరమైతే అఖిలపక్షాన్ని కూడా తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని ట్విట్టర్‌లో గంటా కోరారు.
ఇదిలావుంటే.. శనివారం గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసమే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అమలులోకి వచ్చిన వెంటనే.. తన రాజీనామాను ఆమోదించాలని గంటా శ్రీనివాసరావు స్పీకర్ కు రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తాను మాటల మనిషిని కానని, చేతల మనిషనని.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాజకీయేతర జేఏసీని ఏర్పాటు చేయనున్నట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు.