లోకేష్‌కు షాకిచ్చిన చిరంజీవి!
Ganji Chiranjeevi shock to Lokesh in Mangalagiri.రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో రాజకీయాలు హీటెక్కాయి.
By సునీల్ Published on 11 Aug 2022 12:50 PM IST
రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో రాజకీయాలు హీటెక్కాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాసాలు మంగళగిరి నియోజకవర్గంలోనే ఉన్నాయి. అలాగే మూడు పార్టీల కేంద్ర కార్యాలయాలూ ఆ పరిధిలోనే ఉన్నాయి. గతంలో ఒక నియోజకవర్గంగా పెద్దగా ఆసక్తి కలిగించని మంగళగిరి 2019 ఎన్నికల్లో హాట్ సీటుగా మారింది. 2014 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించింది. ఆ నిర్ణయంతో రాజధాని ప్రాంతంలో ఉన్న మంగళగిరి కీలకంగా మారింది. ఇక 2019 ఎన్నికల్లో మాజీ సీఎం చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పోటీ చేయడంతో తెలుగు రాష్ట్రాల ప్రజల చూపు మంగళగిరి వైపు తిరిగింది. తాజాగా టీడీపీ సీనియర్ నేత గంజి చిరంజీవి పార్టీకి రాజీనామా ప్రకటించడంతో లోకేష్‌కు షాక్ తగిలినట్లే అయింది.
టీడీపీకి అందని విజయం..
మంగళగిరి నియోజకవర్గం టీడీపీకి ఎప్పుడూ కొరకరాని కొయ్యలాంటిదే. 1999 నుంచి 2019 వరకు ఒక్కసారి కూడా విజయం సాధించిందే లేదు 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మురుగుడు హనుమంతరావు, 2009లోనూ అదే పార్టీ నుంచి కాండ్రు కమల గెలుపొందారు. 2014లో ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసి 12 ఓట్ల మెజారిటీతో టీడీపీ నేత గంజి చిరంజీవిపై విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, రాజధానిని ప్రకటించడంతో మంగళగిరి ప్రాధాన్యం పెరిగింది. 2019లో చిరంజీవిని పక్కన పెట్టి నారా లోకేష్ పోటీ చేసి, ఆళ్లపైనే పరాజయం పాలయ్యారు.
సీనియర్ల కన్నా పెద్ద పదవే ఇచ్చాం..
టీడీపీ మాత్రం చిరంజీవికి ఎక్కడా అన్యాయం జరగలేదని చెబుతోంది. చిరంజీవి రాజీనామా, ఆరోపణలపై లోకేష్ స్పందించారు. సీనియర్లు ఎంతోమంది ఉన్నా చిరంజీవిని గౌరవించాలనే రాష్ట్ర కమిటీలోకి తీసుకుని, సముచిత స్థానం కల్పించామన్నారు. మంగళగిరిని తాను వీడలేనని స్పష్టం చేశారు. కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేయటం ఎంత అనివార్యమో మంగళగిరి నుంచి తాను పోటీ చేయటం కూడా అంతే అనివార్యమని తెలిపారు. మంగళగిరి టీడీపీ నేత నందం అబద్దయ్య మాట్లాడుతూ కాంగ్రెస్‌లో కార్యకర్తగా ఉన్న చిరంజీవి 2013లో టీడీపీలో చేరితే 2014లో మున్సిపల్ చైర్మన్ చేశామన్నారు. అదే ఏడాది టికెట్ ఇచ్చి, నియోజకవర్గ ఇన్‌చార్జిగా, 2019లో రాష్ట్ర అధికార ప్రతినిధి పదవిని ఇచ్చామన్నారు. మొత్తంగా మంగళగరి టీడీపీకి మొదటి నుంచి కలసి రావడం లేదు.
వారి బాటలోనే పయనం
తాజాగా టీడీపీకి రాజీనామా చేసిన చిరంజీవి నియోజకవర్గంలోని సీనియర్ల బాటలోనే నడుస్తారనే ప్రచారం జరుగుతోంది. గతంలో టీడీపీలో చేరిన కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు అనంతరం వైసీపీలో చేరారు. ఇటీవల సైలెంటుగా ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన గంజి చిరంజీవి కూడా అదే బాటలో అధికార పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. సుదీర్ఘ కాలం నుంచి టీడీపీ కోసం పని చేసినా మున్సిపల్ చైర్మన్ మినహా ఎలాంటి ప్రాధాన్య పదవి ఇవ్వలేదని చిరంజీవి చెబుతున్నారు. బీసీ నేత కావడం వల్లే 2014లో సొంత పార్టీ నేతలో ఓడించారని వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో కొందరు నాయకులు తనను మానసికంగా హత్య చేశారని, అవమాన భారం భరించలేకనే పార్టీ పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో మరోసారి ముఖ్యమంత్రిని కలిసి వైసీపీ కండువా కప్పుకొంటారని చిరంజీవి అనుచరులు చెబుతున్నారు. అయితే వైఎస్సార్సీపీ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పందనా కనిపించడం లేదు.