అమరావతి: గణేష్ నవరాత్రులకు సమయం దగ్గరపడుతోంది. గణేష్ ఉత్సవ కమిటీలు పండళ్ల ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో పండళ్లను ఏర్పాటు చేయాలనుకునే గణేష్ ఉత్సవ్ కమిటీ నిర్వాహకులు ganeshutsav.net పోర్టల్‌లో పోలీసు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) హరీష్ కుమార్ గుప్తా గురువారం కోరారు. దరఖాస్తులను ధృవీకరించిన తర్వాత పోలీసులు సింగిల్ విండో ద్వారా ఉచితంగా అనుమతి ఇస్తారని డీజీపీ ఒక ప్రకటనలో తెలిపారు.
"ఉత్సవ్ కమిటీ సభ్యులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఎన్‌వోసీ పొందవచ్చు. సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ మండపాలను సందర్శించి, ఏర్పాట్లను ధృవీకరించి, క్యూర్ కోడ్‌తో ఎన్‌వోసీ జారీ చేస్తారు" అని డీజీపీ తెలిపారు. వేడుకలను శాంతియుతంగా, పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ఆన్‌లైన్ వ్యవస్థను ప్రారంభించినట్లు హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు ganeshutsav.net ను విజిట్ చేయండి.