చిత్తూరు జిల్లాలో జూన్ 1 నుంచి లాక్‌డౌన్ ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు మాత్రమే సరుకుల కొనుగోలుకు అవకాశం కల్పించారు. ఉదయం 10 గంటల తర్వాత కర్ఫ్యూ అమల్లోకి వస్తుంది. చిత్తూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్టు మంత్రి చెప్పారు. చిత్తూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న ఒక్క రోజే 2,291 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 15 మంది మరణించారు.
ఇప్పటివరకు జిల్లాలో 1.85లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. వీరిలో 1.63లక్షల మందికి పైగా కోలుకున్నారు. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1,254మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 20వేల 810 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా.. ఏపీలో కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరుకుల కొనుగోలుకు అవకాశం ఇచ్చారు. మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. ఆ సమయంలో ప్రజలెవరూ బయటకు రాకూడదు. బయటకు వస్తే పర్మిషన్ ఉండాల్సిందే.