ప్రపంచం ఆధునిక సాంకేతికతతో, అత్యాధునిక ఆవిష్కరణలతో ముందుకు సాగుతున్నప్పటికీ, వివిధ ప్రాంతాలలో కొందరు వ్యక్తులు కోట్ల విలువైన నిధులు వస్తాయని నమ్మి క్షుద్రపూజలు, నరబలి వంటి సంప్రదాయ మూఢ నమ్మకాలను అనుసరిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రూరల్ మండల పరిధిలోని చౌటపల్లి గ్రామంలో ఆదివారం అర్థరాత్రి భూతవైద్యం జరిగిన ఘటన వెలుగుచూసింది. గుప్త నిధుల పేరుతో ఓ బాలుడిని బలి ఇచ్చేందుకు యత్నిస్తున్నారన్న వార్త స్థానికంగా కలకలం రేపింది. గ్రామంలోకి కొందరు ప్రవేశించి భూతవైద్యం చేస్తున్నారని గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.
వివరాల్లోకి వెళితే తిరువూరు మండలం టేకులపల్లి - చౌటపల్లి గ్రామాల సరిహద్దుల్లో గుప్త నిధులు ఉన్నాయని కొందరు వ్యక్తులు కారులో వచ్చి గ్రామంలో అక్కడక్కడ తిరుగుతున్నారు. గుప్త నిధుల కోసం వచ్చిన వారితో పాటు ఓ చిన్న పిల్లాడు రావడంతో గ్రామస్థులకు అనుమానం వచ్చింది. వారిలో ఓ పూజారి కూడా ఉన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నారని అడిగితే.. సదరు ముఠా పొంతన లేని సమాధానాలు చెప్పింది. మరో వైపు బాలుడు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు.
దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దాదాపు ఎనిమిది మంది సభ్యులు గుప్త నిధుల కోసం గ్రామానికి వచ్చారు. గుప్త నిధుల కోసం వచ్చిన వారిలో సత్తుపల్లి, బుగ్గపాడు, తిరువూరు ఏరుకోపాడు, టేకులపల్లి వాసులు ఉన్నారు. 8 మంది సభ్యుల ముఠాలో నలుగురు పరారీ కాగా మిగిలిన నలుగురిని గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.