పంచాయతీ కార్మికులు రోజులాగే సోమవారం ఉదయం కూడా తమ పనిలో నిమగ్నమయ్యారు. తాడేపల్లి రూరల్ పంచాయతీలోని ఉండవల్లి సెంటర్‌లోని ఎస్‌బీఐ సమీపంలో చెత్తను తొలగిస్తున్నారు. ఇంతలో కార్మికులకు ఓ రూ.500నోటు కనిపించింది. ఈ రోజు లేచిన వేళ బాగుందంటూ దానిని దాచిపెట్టుకున్నారు. అక్కడ ఉన్న చెత్త తొలగిస్తున్న కొద్ది నోట్లు దొరుకుతున్నాయి. మొత్తం అక్కడ ఉన్న చెత్త ఏరివేసేసరికి సుమారు 30 కట్టల నోట్లు కనిపించాయి. అందులో రూ.500,రూ.200, రూ.2వేల రూపాయలు ఉన్నాయి.
అంత పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు కనిపించేసరికి ఆందోళన చెందిన పంచాయతీ సిబ్బంది వెంటనే గ్రామ సచివాలయ సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న సిబ్బంది ఆ నోట్లను పరిశీలించారు. తొలుత దొంగనోట్లుగా బావించగా.. క్షణ్ణంగా పరిశీలిస్తే.. దాని మీద 'చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా', 'ఫర్ స్కూల్ జోన్ ఓన్లీ' అని రాసి ఉంది. దీంతో అంతా నువ్వుకున్నారు. మళ్లీ ఆ నోట్ల కట్టలను చెత్తలో పడేసి డంపింగ్ యార్డకు తరలించారు.