ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) హెచ్.జె. దొర మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. పోలీసు శాఖకు ఒక ప్రత్యేకమైన 'బ్రాండ్' ఇమేజ్ తీసుకురావడంలో హెచ్.జె. దొర కీలక పాత్ర పోషించారని సీఎం చంద్రబాబు అన్నారు. నాడు రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న నక్సల్స్ సమస్యను అదుపు చేయడంలో దొర ఎంతో సమర్థవంతంగా పనిచేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. దివంగత ఎన్టీఆర్ హయాంలో ఇంటెలిజెన్స్ అధికారిగా, తన హయాంలో రాష్ట్ర డీజీపీగా దొర అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
హెచ్.జె. దొర మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, డీజీపీగా పనిచేయడమే కాకుండా.. కేంద్ర స్థాయిలో సీఐఎస్‌ఎఫ్ (CISF) డీజీగా, కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (CVC) వంటి కీలక హోదాల్లో ఆయన విశేష సేవలు అందించారని గుర్తుచేశారు. పోలీసు శాఖను ప్రజలకు మరింత చేరువ చేయడంలో దొర చేసిన కృషి మరువలేనిదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, శోకతప్త హృదయంతో ఉన్న వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రులిద్దరూ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.