తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన రమణ దీక్షితులు
గత ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదాలపై అనేక ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని శ్రీవారి మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు అన్నారు.
By అంజి Published on 20 Sept 2024 1:30 PM IST
తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన రమణ దీక్షితులు
గత ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదాలపై అనేక ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని శ్రీవారి మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు అన్నారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా లడ్డూ ప్రసాదంలో వెజిటబుల్ ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టు తెలిసిందన్నారు. నాణ్యతపై లోపాలు ఎత్తి చూపినందుకు గత ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసిందని చెప్పారు. చంద్రబాబు సీఎం అయ్యాక టీటీడీలో ప్రక్షాళన మొదలైందని వివరించారు.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదాల తయారీకి జంతు కొవ్వు వినియోగిస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు.
సెంటర్ ఆఫ్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్‌స్టాక్ అండ్ ఫుడ్ (CALF) నివేదికపై రమణ దీక్షితులు స్పందించారు. లడ్డూల తయారీకి బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్, పామాయిల్‌ను ఉపయోగించినట్లు CALF తన నివేదికలో పేర్కొంది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూలను ప్రసాదంగా పంపిణీ చేశారు.
విలేకరుల సమావేశంలో రమణ దీక్షితులు మాట్లాడుతూ లడ్డూ ప్రసాదంలో కల్తీపై ఆందోళన వ్యక్తం చేశారు.
''ప్రసాదాల నాణ్యతపై పలు సందర్భాల్లో టీటీడీ చైర్మన్, కార్యనిర్వహణాధికారి ఎదుట ప్రస్తావించారు. వారెవరూ దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఆలయంలో మిగిలిన అర్చకులు వ్యక్తిగత కారణాల వల్ల గొంతు ఎత్తలేదు. గత ఐదేళ్లుగా ప్రసాదాల కల్తీ కొనసాగుతూనే ఉంది'' అని రమణ దీక్షితులు అన్నారు.
“గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో బీఫ్ టాలో, చేప నూనెతో సహా జంతువుల కొవ్వు జాడలు ఉన్నాయని ల్యాబ్ నివేదికలు వెల్లడించాయి. పవిత్రమైన గోవుల నుంచి తయారుచేసిన నెయ్యితో తయారు చేయాల్సిన ప్రసాదంలో కల్తీ జరగడం చాలా దురదృష్టకరం' అని రమణ దీక్షితులు అన్నారు.
కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కెఎంఎఫ్) నుంచి నందిని నెయ్యి కొనుగోలు చేయాలన్న నాయుడు నిర్ణయాన్ని టిటిడి మాజీ ప్రధాన అర్చకుడు స్వాగతించారు. ‘‘గత వైఎస్సార్‌సీపీ హయాంలో అవమానాలు ఎదుర్కొన్నాను. నాపై పెట్టిన కేసులన్నీ రద్దు చేయాలి. లడ్డూ తయారీ వంటగదిని శుభ్రం చేయాలి. టీటీడీ పరిశుభ్రతతో లడ్డూల తయారీని పునఃప్రారంభించాలి’’ అని రమణ దీక్షితులు అన్నారు.