మాజీ ఎంపీ, ఎమ్మెల్యే రత్నాబాయి కన్నుమూత

సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో అలుపెరగని సేవలు అందించిన మాజీ ఎంపీ తడపట్ల రత్నాబాయి (79) ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

By -  అంజి
Published on : 16 Feb 2026 6:48 AM IST

Tadapathla Ratna Bai passes away, Former Rajya Sabha MP Ratna Bai, Rampachodavaram Congress Leader, AP MLC Ratna Bai, Tribal leader death news Andhra Pradesh

మాజీ ఎంపీ, ఎమ్మెల్యే రత్నాబాయి కన్నుమూత

సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో అలుపెరగని సేవలు అందించిన మాజీ ఎంపీ తడపట్ల రత్నాబాయి (79) ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను చికిత్స నిమిత్తం అల్లూరి సీతారామరాజు (పూర్వపు పోలవరం/తూర్పుగోదావరి) జిల్లాలోని రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె అక్కడే కన్నుమూశారు. రత్నాబాయి గిరిజన సామాజిక వర్గం నుంచి వచ్చి రాష్ట్ర మరియు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.

ఆమె రాజకీయ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. కేవలం 25 ఏళ్ల వయసులోనే 1972లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లవరం (ప్రస్తుత రంపచోడవరం) నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ సమయంలో అత్యంత పిన్న వయసులో చట్టసభకు ఎన్నికైన నేతల్లో ఒకరిగా నిలిచారు. ఆమె సేవలను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం 2008లో ఆమెను రాజ్యసభకు పంపింది. 2008 నుండి 2014 వరకు ఆమె ఎంపీగా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ గళాన్ని వినిపించారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆమె రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నారు. 2014 నుండి 2020 వరకు ఆమె ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించారు.

రత్నాబాయి తన పదవీ కాలంలో మారుమూల గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, ముఖ్యంగా అల్లూరి జిల్లా పరిధిలోని గ్రామాల్లో విద్యా, వైద్య సౌకర్యాల కల్పనకు ఎంతో కృషి చేశారు. గిరిజన మహిళల సాధికారత కోసం ఆమె చేసిన పోరాటాలు చిరస్మరణీయం. సౌమ్యురాలిగా, వివాదరహితురాలిగా పేరున్న ఆమె, పార్టీలకు అతీతంగా అందరి మన్ననలు పొందారు. ఆమె మరణవార్త తెలియగానే రంపచోడవరం ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ముఖ్యమంత్రితో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆమె మృతికి సంతాపం ప్రకటించారు. గిరిజన ప్రాంతం ఒక గొప్ప మార్గదర్శిని కోల్పోయిందని వారు కొనియాడారు. ఆమె పార్థివ దేహాన్ని సందర్శించేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు.

Next Story