కరోనా వైర‌స్ శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంది. సామాన్యులు, సెల‌బ్రెటీలు అన్న తేడాలేకుండా అంద‌రూ ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు కూడా ఈ మ‌హమ్మారి బారిన ప‌డ్డారు. కొంద‌రు కోలుకోగా.. మ‌రికొంద‌రు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్క‌ర రామారావు క‌రోనాతో పోరాడుతూ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 72 సంవ‌త్స‌రాలు.

కొన్ని రోజుల క్రితం ఆయ‌నకు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. చికిత్స నిమిత్తం విశాఖ‌ప‌ట్నంలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చేరారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఈ రోజు(ఆదివారం) తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచారు. 1994 - 99, 1999 - 2004 మధ్య రెండు సార్లు పెద్దాపురం శాసనసభ్యునిగా ఎన్నికైన ఆయ‌న‌.. 2012 నుంచి 2017 వరకు ఎమ్మెల్సీ గా కూడా పని చేశారు. పెదపూడి మండలంలోని పెద్దాడకు చెందిన ఆయన అంతకుముందు అంటే 1982లో సామర్లకోట సమితి అధ్యక్షుడిగానూ సేవలు అందించారు. ఆ తర్వాత 1984లో జడ్పీ చైర్మన్‌గా సేవలు అందించారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.


తోట‌ వంశీ కుమార్‌

Next Story