విజయవాడలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో వైసీపీ, టీడీపీ నేతలు పోటాపోటిగా నినాదాలు చేశారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ హడావుడిలోనే ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టేందుకు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
నిన్న మంత్రి కొడాలి నాని గొల్లపూడిలో దేవినేని ఉమాను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహాం వ్యక్తం చేసిన ఉమా.. ఎన్టీఆర్ విగ్రహాం వదద నిరసన దీక్ష చేపడతానని.. దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్ విసిరారు. అన్నట్లుగానే నేడు ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేసేందుకు వచ్చిన ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను అరెస్ట్ చేసే క్రమంలో టీడీపీ కార్యకర్తలకు పోలీసుకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి వాహనంలో అక్కడి నుంచి తరలించారు.
నిన్న ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. మాజీ మంత్రి దేవినేని తన చేతిలోనో, ఎమ్మెల్యేలు కృష్ణప్రసాద్, వల్లభనేని వంశీ చేతిలోనో దెబ్బలు తినక తప్పదని హెచ్చరించారు. ఈ రోజు మైలవరం నియోజకవర్గం వచ్చి మాట్లాడుతున్నానని.. ఎప్పుడనా వస్తానని.. మీ చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మా జగన్ ఏం చేశారో చెబుతానని అన్నారు. మీ ఇంట్లో అయినా ఈ విషయాలను చర్చించేందుకు సిద్దమని మంత్రి సవాల్ విసిరారు.