ఏపీలో ముగిసిన తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గ‌డువు.. నోటాకు చోటు

First phase Nominations closed Local Body polls in AP.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీక‌ర‌ణ గ‌డువు ముగిసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 Jan 2021 12:39 PM GMT
First phase Nominations closed Local Body polls in AP

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీక‌ర‌ణ గ‌డువు ముగిసింది. నేటి సాయంత్రం 5గంట‌ల‌తో గ‌డువు పూర్తియింది. మూడురోజుల పాటు నామినేషన్ల దాఖలు పర్వం సాగింది. ఇవాళ ఆఖరిరోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. తొలి ద‌శ‌లో 168 మండలాల్లో 3,249 గ్రామ పంచాయతీలకు, 32,504 వార్డులకి ఎన్నికలు జరగనుండగా సర్పంచ్ పదవులకు 13 వేలకు పైగా నామినేషన్లు.. వార్డు పదవులకి‌ 35 వేలకి పైగా నామినేష‌న్లు దాఖలు అయ్యాయి. రేపు నామినేష‌న్ల‌ను అధికారులు ప‌రిశీలించ‌నున్నారు.

ఫిబ్ర‌వ‌రి 4న మధ్యాహ్నం 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండగా.. ఫిబ్రవరి 9న ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 4 గంట‌ల నుంచి ఓట్ల లెక్కింపు చేప‌ట్టి ఫ‌లితాలు వెల్ల‌డించ‌నున్నారు.

నోటాకు చోటు..

ఈ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతుంటాయి. పార్టీ గుర్తులు కాకుండా ఎన్నికల కమిషన్ ఇచ్చిన గుర్తులమీద అభ్యర్థులు పోటీ చేయాల్సి ఉంటుంది. మాములు ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల గుర్తులతో పాటుగా చివర్లో నోటా గుర్తుకూడా ఉంటుంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉంటారు కాబట్టి నోటాకు ఓట్లు పడినా పెద్దగా పట్టించుకోరు. అయితే, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా నోటాను తీసుకొచ్చింది ఎన్నికల సంఘం. బ్యాలెట్ పేపర్లో చివర నోటా గుర్తును కూడా ముద్రిస్తోంది. ఒకవేళ అభ్యర్థులు ఎవరూ నచ్చకుంటే మాత్రం నోటాకు ఓటు వెయ్యొచ్చు. పంచాయతీ ఎన్నికల్లో నోటా ఇప్పుడు కీలకపాత్ర పోషించే అవకాశం ఉన్నది


Next Story