మచిలీపట్నంలోని డీమార్ట్‌లో మంగళవారం మధ్యాహ్నం డేంజర్ అలారం మోగింది. దీనికి తోడు స్టోర్ గదిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని, వినియోగదారులు ఇన్‌గేటు, ఎగ్జిట్ గేటు ద్వారా సురక్షితంగా బయటకు చేరుకోవాలని అక్కడి సిబ్బంది మైక్‌లో ప్రచారం చేశారు. దీంతో భయాందోళనకు గురైన వినియోగదారులు ఎక్కడి సరుకులను అక్కడే వదిలివేసి బయటకు పరుగులు తీశారు.
అగ్నిప్రమాదం కాదు.. మాక్ డ్రిల్
అయితే ఇది అగ్నిప్రమాదం కాదని మాక్ డ్రిల్ అని ఆ తరువాత తెలిసింది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీమార్ట్ యాజమాన్యం మాక్ డ్రిల్ నిర్వహిస్తుంటుందని ఫైర్ ఆఫీసర్ తెలిపారు. ఒకవేళ అగ్నిప్రమాదం ఏదైనా సంభవించినప్పుడు సురక్షితంగా బయటకు ఎలా రావాలి అన్న దానిపై తాము వినియోగదారులతో పాటు డీమార్ట్ సిబ్బందికి అవగాహన కల్పిస్తుంటామని చెప్పారు. తొలుత అగ్నిప్రమాదం జరిగిందని తెలిసి వినియోగదారులతో పాటు స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. అయితే.. ఇది మాక్‌డ్రిల్ అని తెలియడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.