గ్యాస్ సిలిండర్ల లోడుతో వెలుతున్న లారీలో మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు లారీ మొత్తం వ్యాపించాయి. మంటల దాటికి గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దంతో ఒక్కొక్కటిగా పేలుతూ ఉంటే.. చుట్టు పక్కల ఉన్న వారికి ఎం జరుగుతుందో కాసేపటి వరకు అర్థం కాలేదు. ఇలా ఒకటి కాదు రెండు దాదాపు వందకు పైగా సిలిండర్లు పేలాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కర్నూలు నుండి నెల్లూరు జిల్లా ఉలవపాడుకు గ్యాస్ సిలిండర్ల లోడుతో ఓ లారీ వెలుతోంది. ఆ లారీలో మొత్తం 300 పైగా సిలిండర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని పెద్దవాడ వద్దకు చేరుకునే సరికి లారీ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు లారీ మొత్తానికి వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్.. లారీ దిగి దూరంగా పరిగెత్తాడు. మంటల ధాటికి సిలిండర్లు భారీ శబ్దంతో ఒక్కొక్కటిగా పేలుతూ ఉన్నాయి.
భారీ శబ్ధంతో పేలుళ్లు సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు. అయితే.. సిలిండర్లు పేలుతుండడంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు చాలా సమయం పట్టింది. దాదాపు 100కి పైగా సిలిండర్లు పేలినట్లు వారు తెలిపారు. భారీ శబ్దంతో సిలిండర్లు పేలడంతో రాత్రంతా దద్దవాడ గ్రామ ప్రజలు బిక్కుబిక్కు మంటూ గడిపారు. ఈ ఘటనతో అమరావతి-అనంతపురం రహదారిపై రాత్రి నుండి రాకపోకలు నిలిచిపోయాయి.