రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అయితే.. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలంలోని దువ్వలో జరుగుతున్న వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఓ ఆలయంలో వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.
వివరాలు ఇలా ఉన్నాయి. దువ్వలోని స్థానిక వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలిచివచ్చారు. వేసవి కాలం కావడంతో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. అయితే.. ఉన్నట్లుండి ఒక్కసారి మంటలు చలువ పందిళ్లకు అంటుకున్నాయి. దీంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.
మంటలు అంటుకోగానే అప్రమత్తమైన భక్తులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే పందిళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ఘటనలో ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా..షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.