వైఎస్ వివేకా హత్య కేసులో సంచ‌ల‌న విష‌యాలు.. వివేకాను చంప‌మ‌న్న‌ది ఆయ‌నే

Financial settlement led to assassination of Viveka.మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Nov 2021 5:27 AM GMT
వైఎస్ వివేకా హత్య కేసులో సంచ‌ల‌న విష‌యాలు.. వివేకాను చంప‌మ‌న్న‌ది ఆయ‌నే

మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. బెంగళూరులో జరిగిన ల్యాండ్‌ సెటిల్‌మెంటే వివేకా హ‌త్య‌కు కారణమని నిందితుల్లో ఒక‌డైన అప్రూవ‌ర్‌గా మారిన కారు డ్రైవర్ షేక్ ద‌స్త‌గిరి వెల్ల‌డించాడు. వివేకానంద‌రెడ్డిని చంపేయ్‌.. నువ్వు ఒక్క‌డివే కాదు మేము నీతో పాటు వ‌స్తాం. దీని వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ మ‌నోహ‌ర్ రెడ్డి, వైఎస్ భాస్క‌ర్ రెడ్డి, డి.శంక‌ర్ రెడ్డి వంటి పెద్ద‌వాళ్లు ఉన్నార‌ని.. ఈ హ‌త్య చేస్తే శంక‌ర్ రెడ్డి రూ.40 కోట్లు ఇస్తార‌ని అందులో త‌న‌కు రూ.5కోట్లు ఇస్తానంటూ ఎర్ర గంగిరెడ్డి చెప్పారని కన్ఫెషన్‌ రిపోర్టులో ద‌స్త‌గిరి పేర్కొన్నాడు.

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు ప్రిన్సిప‌ల్ జూనియ‌ర్ సివిల్ జ‌డ్జి న్యాయ‌స్థానంలో సీఆర్‌పీసీ164(1) ప్ర‌కారం ద‌స్త‌గిరి ఆగ‌స్టు 31న‌, సీబీఐకి ఆగ‌స్టు 25న ఇచ్చిన వాంగ్మూలాలు శ‌నివారం వెలుగులోకి వ‌చ్చాయి. వైఎస్ వివేకా హత్య జరిగిన తీరును వివరిస్తూ దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ను మిగతా నిందితుల లాయర్లకు కోర్టు ఇచ్చింది. వివేకా హత్యలో తనతో పాటు నలుగురు పాల్గొన్నట్టు దస్తగిరి అంగీకరించాడు.

వాంగ్మూలంలో సంచలన విషయాలు..

2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడానికి గంగిరెడ్డి మోసమే కారణమని, మీ సంగతి తేలుస్తానంటూ వివేకా వార్నింగ్‌ ఇచ్చినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్ లో ద‌స్త‌గిరి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసం చేయడంతో ఎర్ర గంగిరెడ్డి, గుజ్జుల జగదీశ్వర్‌రెడ్డిని వివేకా.. ఆఫీసుకు పిలిపించి తిట్టినట్టు చెప్పాడు. బెంగళూరులో భూముల లావాదేవీలకు సంబంధించి వాటా ఇవ్వకపోవడంపై వివేకాపై ఎర్ర గంగిరెడ్డి ఆగ్రహం పెంచుకున్నట్లు తెలిపాడు. తర్వాత కొన్ని రోజుల పాటు వైఎస్ వివేకా, గంగిరెడ్డి మధ్య విబేధాలు తలెత్తాయి. 2018లో వివేకా వద్ద నుంచి డ్రైవర్ గా ప‌ని మానేశాను. అప్పుడ‌ప్పుడూ ఎర్ర గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్‌ను కలుసుకునేవాడి. ఈ నేపథ్యంలో వివేకాను హ‌త్య‌చేస్తే రూ.5కోట్లు ఇస్తాన‌ని గంగిరెడ్డి చెప్పాడు. ముందుగా కోటి రూపాయ‌ల అడ్వాన్స్‌ను ఇచ్చాడు. మొత్తం హ‌త్య‌కు రూ.40కోట్లు సుపారీ అని ద‌స్త‌గిరి చెప్పాడు.

హ‌త్య జ‌రిగిన రోజు రాత్రి 11.40 గంట‌ల‌కు వివేకా కారు ఇంటి లోప‌లికి వెళ్ల‌డాన్ని చూశాం. సునీల్, ఉమా శంకర్, నేను వివేకా ఇంటికి వెళ్లాం. ప్ర‌హారీ దూకి లోప‌లి వెళ్లాం. వాచ్‌మెన్ రంగ‌న్న నిద్ర‌పోతున్నాడు. ప‌క్క వాకిలి త‌లుపుత‌ట్ట‌గా గంగిరెడ్డి త‌లుపు తెరిచి మ‌మ్మ‌ల్ని లోప‌లికి తీసుకెళ్లాడు. ఆ స‌మ‌యంలో వివేకా మ‌మ్మ‌ల్ని చూసి ఈ స‌మయంలో వీళ్లెందుకు వ‌చ్చార‌ని గంగిరెడ్డిని ప్ర‌శ్నించాడు. డ‌బ్బుల విష‌యం మాట్లాడేందుకు వ‌చ్చారంటూ స‌మాధానం ఇచ్చాడు. బెంగళూరు స్థలంలో వివేకాను ఎర్ర గంగిరెడ్డి వాటా అడిగాడు. అప్పుడే సునీల్ వివేకా ముఖంపై గట్టిగా కొట్టగా వివేకా పడిపోయాడు. ఉమాశంకర్ రెడ్డి గొడ్డలితో వివేకా ఛాతీపై 8 సార్లు బ‌లంగా కొట్టాడు. మేం త‌ప్పించుకునేందుకు డ్రైవ‌ర్ ప్ర‌సాదే త‌న‌ను చంపి పారిపోయాడ‌ని, అత‌న్ని వ‌ద‌లొద్దంటూ వివేకాతోనే బ‌ల‌వంతంగా ఓ లేఖ రాయించి సంత‌కం పెట్టించాం. త‌రువాత బాత్రూమ్ లోకి తీసుకెళ్లి వివేకాను హత్య చేశారు. ఆ తర్వాత సునీల్, ఉమా శంకర్ కొన్ని పత్రాలు తెచ్చారు. ఆ తర్వాత అందరం గోడ దూకి పారిపోయాం. భయపడొద్దని.. అవినాష్, శంకర్ రెడ్డి చూసుకుంటారని గంగిరెడ్డి చెప్పాడు. అని దస్తగిరి చెప్పాడు.

Next Story