నాసిన్ భూమి పూజలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Finance Minister Nirmala Sitharaman participated in Nasin Bhoomi Pooja.అనంతపురం జిల్లాలో కేంద్ర ఆర్థిక
By తోట వంశీ కుమార్ Published on 5 March 2022 1:08 PM GMTఅనంతపురం జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. శనివారం మధ్యాహ్నాం ప్రత్యేక విమానంలో బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రి.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం జిల్లాకు చేరుకున్నారు. పర్యటనలో భాగంగా పాలసముద్రం గ్రామంలో ఏర్పాటు చేయనున్న నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్) సంస్థ భూమి పూజలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన్న, ఆర్‌అండ్‌బీ మంత్రి ఎం శంకరనారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, కేంద్ర నెహ్రూ యువకేంద్రం (ఎన్ వై కెఎస్) వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
500.35 ఎకరాల్లో సుమారు రూ.700 కోట్లతో నాసిన్ సంస్థ అకాడమీని నిర్మించనున్నారు. దక్షిణాదిలో రెండో అతిపెద్ద శిక్షణ కేంద్రం ఇదే కావడం గమనార్హం. ఐఆర్‌ఎస్‌లకు (ఇండియన రెవెన్యూ సర్వీసెస్) ప్రొబెషనరీలో భాగంగా ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. పరోక్ష పన్నుల అంశంపై అభ్యర్థుల సామర్థ్యాన్ని పెంచేలా శిక్షణ ఇస్తారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ, రెవెన్యూ డిపార్ట్‌మెంట్, పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డు పరిధిలో నాసిన్ పనిచేస్తుంది. దీన్ని గతంలో నాసన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్)గా పిలిచేవారు. తర్వాత నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్‌గా పేరు మార్చారు.
కాగా.. కేంద్ర ఆర్థిక మంత్రి పర్యటనలో ప్రోటోకాల్ వివాదం తెరపైకి వచ్చింది. ఆహ్వానపత్రంలో తన పేరు లేదని ఎంపీ గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేయగా.. మరో ఎంపీ తలారి రంగయ్య ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందలేదని హాజరుకాలేదు.