మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పీర్ల పండుగను హిందూ, ముస్లింలు సోదరభావంతో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. కాగా.. మొహర్రం వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి అగ్నిగుండంలో పడి సజీవదహనం అయ్యాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా అవుకు మండలం సంకేసుల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక దస్తగిరిస్వామి పీర్ల చావిడి వద్ద మొహర్రం వేడుకల సందర్భంగా అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశారు.
పెద్ద ఎత్తున మంటలు వేశారు. వేడులకను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అలాగే.. పక్క గ్రామమైన కాశిపురానికి చెందిన వెంకటసుబ్బయ్య(48) కూడా పీర్ల పండుగను చూసేందుకు వచ్చాడు. చావిడిలోని పీర్లను దర్శించుకున్నారు. అనంతరం మద్యం తాగి మత్తులో పక్కనే ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో పడిపోయాడు. స్థానికులు గమనించిన వెంటనే కర్రల సాయంతో అతడిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. అయితే.. అప్పటికే అతడు కాలిపోయి సజీవ దహనం అయ్యాడు. ఈ ఘటనతో సుంకేసుల, కాశీపురం గ్రామాల్లో విషాదం నెలకొంది.