తిరుపతి నగరంలోని రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటనను మరువక ముందే తిరుపతి జిల్లాలో మరో అవమానవీయ ఘటన చోటు చేసుకుంది. రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని తరలించేందుకు 108 వాహన సిబ్బంది నిరాకరించగా.. ఆటో డ్రైవర్లు, ఇతర వాహనాలు అంగీకరించకపోవడం, ప్రైవేటు అంబులెన్స్‌లు పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడంతో అంత చెల్లించలేని ఆ తండ్రి.. తన చిన్నారి మృతదేహాన్ని బైక్‌పై తీసుకువెళ్లాడు.
దొరవారిసత్రం మండలం కొత్తపల్లి గ్రామంలో అక్షయ(2) అనే చిన్నారి తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. అయితే.. గురువారం ప్రమాదవశాత్తు అక్షయ గ్రావెల్ గుంతలో పడి నీటమునిగింది. గమనించిన స్థానికులు, తల్లిదండ్రులు చిన్నారిని నీటిలోంచి బయటకు తీసి.. తిరుపతి జిల్లాలోని నాయుడు పేట ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆస్పత్రికి తీసుకువచ్చే సరికి అక్షయ మృతి చెందినట్లు తెలిపారు. చిన్నారి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు 108 వాహన సిబ్బంది, ఆటో డ్రైవర్‌లు నిరాకరించారు. ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లు భారీగా నగదు డిమాండ్ చేయడంతో అంత స్థోమత లేని ఆ తండ్రి.. తన చిన్నారి మృతదేహాన్ని బైక్‌పైనే 18 కిలోమీటర్ల దూరంలోని తన స్వగ్రానికి తీసుకువెళ్లాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.