ఆయుర్వేద అధ్యయనం పూర్తి

Anadaiah Ayurvedic medicine study completed.నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నంకు చెందిన ఆనంద‌య్య త‌యారు చేసిన మందు తీసుకున్న వారిపై ఆయుర్వేద వైద్య బృందం విచార‌ణ పూర్తి చేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 May 2021 5:23 AM GMT
Anadaiah Ayurvedic medicine

నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నంకు చెందిన ఆనంద‌య్య త‌యారు చేసిన మందు తీసుకున్న వారిపై ఆయుర్వేద వైద్య బృందం విచార‌ణ పూర్తి చేసింది. నివేదికను సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్సెస్‌ (సీసీఆర్‌ఏఎస్‌)కు పంపింది. నివేదికను పరిశీలించాక వారు ఇచ్చే ఆదేశాల కోసం ఆయుర్వేద వైద్య బృందం ఎదురుచూస్తోంది. ఇప్ప‌టికే ఆనంద‌య్య మందు ప‌రిశోధ‌న పురోగ‌తిపై ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు, కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు, ఐసీఎంఆర్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ప్రొ.బ‌ల‌రాం భార్గ‌మ్ ఫోన్ చేసి ఆరా తీశారు.

ఆనందయ్య మందు తీసుకున్న వారికి ప్రతికూల ప్రభావం ఉందా? లేదా? అని తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐసీఎంఆర్‌తో పాటు ఆయుర్వేద వైద్య నిపుణులతో కమిటీ వేసిన విషయం తెలిసిందే. దీనిపై తిరుపతి ఎస్వీ ఆయుర్వేద కళాశాల, విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరి శోధన సంస్థ సంయుక్తంగా కమిటీ ఏర్పాటైంది. ఆయా సంస్థల ఆయుర్వేద వైద్యులు రెస్ట్రోపెక్టివ్ స్ట‌డీని పూర్తి చేశారు. ఆనంద‌య్య మందు తీసుకున్న 570 మందితో వారు మాట్లాడారు.

కరోనా రాకుండా ఉండేందుకు, పాజిటివ్‌ వచ్చాక మందు తీసుకున్న వారు, ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయిన తరువాత మందు తీసుకున్న వారితో వివరంగా మాట్లాడారు. మందు తీసుకున్న తరువాత పాజిటివ్‌ ఎవరికైనా వచ్చిందా? లేదా?, అనా రోగ్య సమస్యలు తలెత్తాయా? వంటి వివరాలను సేకరించారు. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను అధికారులు సీసీఆర్ఏఎస్‌కు ఆన్‌లైన్‌లో అప్ లోడ్ చేశారు. కమిటీ విచారణలో దాదాపు అందరూ ఆనందయ్య మందుకు అనుకూలంగానే అభిప్రాయం తెలియజేసినటు సమాచారం. కాగా, ఆనందయ్య మందు జంతువులపైనా ప్రయోగించేందుకు తిరుపతి సమీపంలోని సృజన లైఫ్‌ ల్యాబ్‌ ఎదురుచూస్తోంది.

Next Story