ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కాణిపాకం ఆలయం ఒకటి. ఇక్కడ విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడు వరసిద్ధి వినాయకుడిగా పూజలను అందుకుంటాడు. అయితే.. ఈ ఆలయంలో అభిషేకం టికెట్ ధరను ఒకేసారి భారీగా పెంచారనే వార్తలు వచ్చాయి. రూ.700 నుంచి రూ.5వేలకు పెంచడంతో భక్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై దేవాదాయ శాఖ వివరణ ఇచ్చింది.
కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో అభిషేకం టికెట్ ధర పెంచలేదని దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఉన్న రూ.700 ధర యథాతథంగా కొనసాగనున్నట్లు చెప్పింది. దాతల సహకారంతో అత్యంత సుందరంగా పునఃనిర్మించిన ఆలయంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ స్వామివారి అభిషేకం భక్తులకు అందుబాటులో ఉండాలని దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్, సభ్యులు దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది.
స్వామివారి అభిషేకం టికెట్ ధర రూ.700 నుంచి రూ.5వేలకు పెంచడానికి ఆలయ అధికారులు విడుదల చేసిన ప్రజాభిప్రాయ సేకరణపత్రం అవగాహనా రాహిత్యంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని దేవాదాయ కమిషనర్ వెల్లడించారు.