మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలనం: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్!

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

By -  అంజి
Published on : 15 March 2026 11:43 AM IST

Moinabad Farmhouse Drug Case, MP Putta Mahesh Kumar Drugs Positive, Pilot Rohit Reddy Drug Raid, Cocaine Positive Reports, Hyderabad Farmhouse Party Bust, Eagle Team SOT Raids

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలనం: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్!

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌కు డ్రగ్స్ పాజిటివ్ అని తేలడం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. మొదట జరిగిన పరీక్షల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, శాస్త్రీయ పరీక్షల్లో ఆయన డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది.

పోలీసుల కథనం ప్రకారం.. పార్టీలో పట్టుబడిన అందరికీ మొదట యూరిన్ టెస్టులు నిర్వహించారు. ఆ సమయంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యూరిన్ రిపోర్టులో 'నెగిటివ్' అని వచ్చింది. అయితే, అధికారులకు ఆయన ప్రవర్తనపై అనుమానం రావడంతో లోతుగా పరిశీలించగా విస్తుపోయే విషయం బయటపడింది. టెస్ట్ కోసం ఇచ్చిన యూరిన్ శాంపిల్స్‌లో ఆయన నీళ్లు కలిపినట్లు అధికారులు గుర్తించారు. తద్వారా ఫలితాన్ని తారుమారు చేసేందుకు ప్రయత్నించినట్లు స్పష్టమైంది.

బ్లడ్ టెస్టులో బయటపడ్డ కొకైన్!

అనుమానం వచ్చిన అధికారులు వెంటనే ఎంపీకి బ్లడ్ టెస్ట్ (రక్త పరీక్ష) నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయన కొకైన్ తీసుకున్నట్లు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఈగల్ టీం ఎస్పీ గిరిధర్ అధికారికంగా ధృవీకరించారు. నిన్నటి పరీక్షల్లో తప్పించుకున్నప్పటికీ, నేడు జరిగిన పక్కా శాస్త్రీయ పరీక్షల్లో ఎంపీ అసలు రంగు బయటపడింది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కూడా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఎఫ్ఐఆర్‌లో 11 మంది.. కఠిన చర్యలకు ఆదేశం

పైలెట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ వీకెండ్ పార్టీలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు మొత్తం 11 మందిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. నిందితుల హోదా ఏదైనప్పటికీ, చట్టం ముందు అందరూ సమానమేనని ఎస్పీ గిరిధర్ స్పష్టం చేశారు. డ్రగ్స్ వాడకంపై ప్రభుత్వం అత్యంత కఠినంగా ఉందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story