పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగు బీభత్సం, బస్సుపై దాడి
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది.
By Srikanth Gundamalla Published on 4 Sept 2023 5:25 PM ISTపార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగు బీభత్సం, బస్సుపై దాడి
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. ఇటీవల చిత్తూరు జిల్లాలో మంద నుంచి తప్పిపోయిన ఓ ఏనుగు భార్యాభర్తలపై దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే. తాజాగా మన్యం జిల్లాలో ఏనుగు బస్సుపై దాడి చేసింది. రహదారిపై జనాలను భయపెడుతు పరుగులు తీసింది. ఏనుగు ఎక్కడ దాడి చేస్తుందో అన్న భయంతో జనాలు కూడా హడలిపోయారు.
పార్వతీపురం - రాయగడ ప్రధాన రహదారిపై కొమరాడ మండలం ఆర్తాం గ్రామం వద్ద ఒంటరి ఏనుగు బీభత్సం చేసింది. ఉన్నట్లుండి ఒక ఒంటరి ఏనుగు రోడ్డుపైకి వచ్చింది. ఆ తర్వాత వాహనాలు ఎటూ పోకుండా అక్కడే నిల్చుంది. దాంతో.. ఇరువైపులా వాహనాలు అటూ, ఇటూ రెండు వైపులా నిలిచిపోయాయి. అందులో బస్సు కూడా ఉంది. ఒంటరి ఏనుగు బస్సు వైపు వెళ్లి.. ముందు అద్దాలపై దాడి చేసింది. దాంతో.. అద్దం మొత్తం ధ్వంసమైంది. అందులో ఉన్న ప్రయాణికులు వణికిపోయారు. ఇక వెనకనుండి కొందరు వ్యక్తులు ఏనుగుని అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు అరుస్తూ పరిగెత్తారు. కానీ.. ఆ ఏనుగు మాత్రం భయపడలేదు. అరుస్తూ పరిగెత్తుకు వస్తున్న వ్యక్తులపైకి దాడికి యత్నించింది. ఏనుగు తమవైపు తిరగడంతో వారు కూడా భయపడిపోయి పరుగు అందుకున్నారు. వేగంగా పరిగెత్తి ఏనుగు దాడి నుంచి ఓ వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు.
కర్రలతో సహాయంతో బెదిరిస్తూ ఏనుగును తరిమేందుకు కొందరు యువకులు ప్రయత్నించారు. అది అస్సలు బెదరకపోగా.. మరింత రెచ్చిపోయింది. అక్కడే ఉన్న గ్రామ (ఆర్తాం) సచివాలయంపై ఏనుగు దాడి చేసినట్లు తెలుస్తోంది.. అక్కడ పార్క్ చేసి ఉన్న రెండు బైకులను ధ్వంసం చేసింది. అటూ ఇటూ తిరుగుతూ అందరినీ హడలెత్తించిన ఆ గజరాజు. అలా కాసేపు నానా బీభత్సం సృష్టించి చివరకు పంట పొలాల మీదుగా అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ మార్గంలో వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.ఆ ఒంటరి ఏనుగు పేరు హరి అని, అది గుంపు నుంచి తప్పిపోయి సంచరిస్తోందని అధికారులు తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.