'రేపు ఢిల్లీకి రండి'.. ఏపీ సీఎస్, డీజీపీలకు ఈసీ సమన్లు
పోలింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల అల్లర్లు జరగడంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది.
By అంజి Published on 15 May 2024 4:34 PM IST'రేపు ఢిల్లీకి రండి'.. ఏపీ సీఎస్, డీజీపీలకు ఈసీ సమన్లు
పోలింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల అల్లర్లు జరగడంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని పదే పదే చెప్పినా.. అలాంటి ఘటనలే చోటు చేసుకోవడంతో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డితో పాటు డీజీపీ హరీశ్ కుమార్‌కి సమన్లు జారీ చేసింది. పరిస్థితిని నియంత్రించలేకపోవడానికి కారణాలంటే రేపు ఢిల్లీకి వచ్చి వివరించాలని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం.. రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను అదుపు చేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని రేపు ఢిల్లీకి వచ్చి వ్యక్తిగతంగా వివరించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పటికీ అమలులో ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తూ, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రధాన కార్యదర్శి, పోలీసు చీఫ్‌ను ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని కమిషన్ పదే పదే నొక్కిచెప్పిందని, లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికలను ప్రశాంతంగా, హింసకు తావులేకుండా నిర్వహించేందుకు వ్యక్తిగతంగా పర్యవేక్షించారని అధికారులు తెలిపారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ గురువారం ఢిల్లీలోని ఈసీ ప్రధాన కార్యాలయంలో హాజరైనప్పుడు, ఎన్నికల అనంతర హింసను నియంత్రించడంలో పరిపాలన వైఫల్యానికి గల కారణాలను "వ్యక్తిగతంగా వివరించమని" ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులను కోరతారని ఆ వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి కూడా వారిని అడగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సోమవారం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు కలిసి జరిగిన ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలపై అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.