దురంతో ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. బొలెరో వాహనాన్ని దురంతో ఢీ కొట్టింది. ఈ ఘటన ఏలూరు జిల్లా భీమడోలు వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగింది. ఈ ప్రమాదం కారణంగా రైలు దాదాపు 5 గంటలకు పైగా నిలిచిపోయింది.
దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెలుతోంది. రైలు వస్తుండడంతో భీమడోలు జంక్షన్ వద్ద రైల్వే గేటును సిబ్బంది వేశారు. అయితే.. బొలెరో వాహనంలో కొందరు రైల్వే గేటును ఢీ కొట్టి వెళ్లేందుకు యత్నించారు. బొలేరో వాహనం రైలు పట్టాలపై వచ్చి ఆగింది. అదే సమయంలో రైలు వస్తుండడంతో అందులోని వారు వాహనాన్ని వదిలివేసి వెళ్లిపోయారు.
రైలు బొలెరోను ఢీ కొట్టింది. వాహనం ధ్వంసమైంది. రైలు ఇంజిన్ దెబ్బతింది. రైలును ఆపివేశారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మరో ఇంజిన్‌ను రైలుకు అమర్చేందుకు యత్నిస్తున్నారు. ఐదు గంటలకు పైగా రైలు నిలిచిపోవడంతో అందులోని ప్రయాణీకుల్లో కొందరు ప్రత్యామ్నాయ మార్గాల్లో బయలుదేరి వెళ్లారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
దీనిపై రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. బొలెరో వాహనంలో వచ్చిన వారు దొంగలా..? పారిపోయే క్రమంలో రైల్వే గేటును ఢీ కొట్టారా..? ఇంకేదైనా కారణం ఉందా..? అన్న కోణంలో విచారణ చేపట్టారు. పారిపోయిన వారి కోసం గాలింపు చేపట్టారు.