చాలా దేవాలయాల్లో ప్రస్తుతం సంప్రదాయ దుస్తులను వేసుకుని వెళ్తేనే దర్శనానికి అనుమతి ఇస్తూ ఉన్నారు. తిరుమలలో ఖచ్చితంగా హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబించే వస్త్రాలనే ధరించాలని ఇప్పటికే టీటీడీ నిర్ణయం తీసుకుంది. దేశం లోని చాలా పుణ్యక్షేత్రాలలో సంప్రదాయానికి పెద్ద పీఠ వేస్తూ వస్తున్నారు. ఇప్పుడు విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్లే భక్తులు కూడా విధిగా సంప్రదాయ వ్రస్తాలు ధరించాలని ఆలయ అధికారులు కోరారు. ఇప్పటికే దుర్గామల్లేశ్వరస్వామి వారికి నిర్వహించే ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ వ్రస్తాలు ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు.
సోమవారం నుంచి దుర్గమ్మ దర్శనానికి వెళ్లే భక్తులు కూడా విధిగా సంప్రదాయ వ్రస్తాలు ధరించాలని.. ఈ సంప్రదాయం అమలయ్యేలా చూడాలని దుర్గ గుడి ఈవో ఎంవీ సురేష్ బాబు ఆలయ అధికారులకు ఆదేశించారు. నిబంధనల సడలింపులో భాగంగా సంప్రదాయ దుస్తులు ధరించిన భక్తులకు అంతరాలయ దర్శనం కల్పించాలన్నారు. పురుషులకు దోవతి, పైజామా లాల్చీలు, మహిళలకు చీర, చున్నీలతో కూడిన పంజాబీ డ్రస్సును మాత్రమే అనుమతిస్తారు. సంప్రదాయ దుస్తులు లేకుండా అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానం పవిత్ర సారె కౌంటరులో పంచె, కండువా సెట్‌ను రూ.200లకు విక్రయించనున్నారు.