పేషెంట్‌కు 'పోకిరి' సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ చేసిన వైద్యులు
గుంటూరు జనరల్ గవర్నమెంట్ ఆస్పత్రిలో అరుదైన సర్జరీ జరిగింది.
By Srikanth Gundamalla Published on 4 Feb 2024 6:00 PM ISTపేషెంట్‌కు 'పోకిరి' సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ చేసిన వైద్యులు
గుంటూరు జనరల్ గవర్నమెంట్ ఆస్పత్రిలో అరుదైన సర్జరీ జరిగింది. పేషెంట్‌కు ఇష్టమైన సినిమా చూపిస్తూ వైద్యులు అతనికి బ్రెయిన్ ట్యూబర్ సర్జరీ చేశారు. ఆ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. ప్రయివేట్ ఆస్పత్రులకు పరిమితమైన ఆధునిక చికిత్సలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా విజయవంతంగా పూర్తి చేస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం ఐలాపురంకు చెందిన ఒక వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడు. అపస్మారక స్థితిలో అతడిని కుటుంబ సభ్యులు గుంటూరు జనరల్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అయితే.. అప్పటికే అతని కుడిచేయి, కాలు చచ్చుపడిపోయి ఉన్నాయి. ఇక అతనికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్స్.. మెదడులోని ఎడమ భాగంలో ఉండే మోటార్ కార్టెక్స్‌లో కణితిని గుర్తించారు. శస్త్ర చికిత్స చేయాలని చెప్పాడు. అయితే.. రోగికి మెలకువ ఉన్న సమయంలోనే ఈ శస్త్రచికిత్స చేయాలి. రిస్క్‌తో కూడుకున్నది అని కూడా చెప్పారు. కానీ.. ఎలాగైనా శస్త్రచికిత్స చేయాలని కుటుంబ సభ్యులు కోరడంతో వైద్యులు అందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే రోగికి ఇష్టమైన హీరో మహేశ్‌బాబు అని తెలుసుకుని.. తనకు ఇష్టమైన పోకిరి సినిమాను ఆపరేషన్ థియేటర్లోనే వేసి అది చూపిస్తూ ఆపరేషన్ చేశారు వైద్యులు.
ఇక ఆపరేషన్ పూర్తయిన తర్వాత రోగి ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడని వైద్యులు తెలిపారు. అతడిని డిశ్చార్జ్ చేశారు. చచ్చుబడిపోయిన కాలు, చేయి కూడా ప్రస్తుతం పనిచేస్తున్నాయని వైద్యులు వెల్లడించారు. అయితే.. ఈ తరహా ఆపరేషన్ ఏపీలో ఇతర ఏ ప్రభుత్వ ఆస్పత్రిలో జరగలేదనీ.. మొదట గుంటూరులోనే చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసిన వైద్యులను ఆయన కొనియాడారు.