మధ్నాహ్న భోజనం వికటించి 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం విశ్వనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. 92 మంది విద్యార్థులు శుక్రవారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం వారిలో కొంత మంది వెంటనే వాంతులు చేసుకున్నారు. ఉపాధ్యాయులు, స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కలుషితమైన ఆహారం తినడం వలనే విద్యార్థులకు వాంతులు అయినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయ్‌కుమార్ తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చికిత్స అందిస్తున్నామని అనంతరం విద్యార్థులను డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే డీఈవో రంగారెడ్డి ఆస్పత్రికి వెళ్లి.. చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని, వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారు. పాడైపోయిన గుడ్లను వడ్డించడం వల్లే చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు తెలిసిందన్నారు. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు డీఈవో వెల్లడించారు.