నేడు 'దిశ మొబైల్ యాప్' అవగాహన సదస్సు
Disha mobile App awareness Conference Today.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం జగన్ ప్రభుత్వం
By తోట వంశీ కుమార్ Published on 29 Jun 2021 10:16 AM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం జగన్ ప్రభుత్వం దిశ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. దిశ యాప్ పై నేడు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో అవగాహాన సదస్సును నిర్వహించనున్నారు. ఈ అవగాహాన సదస్సులో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ మొబైల్ యాప్‌ను విద్యార్థినులు, యువతులు, మహిళలు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరాన్ని సీఎం జగన్ స్వయంగా వివరించనున్నారు.
దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం, ఆపద సమయంలో ఉపయోగించడం ఎలా అనే విషయంపై సీఎం వీడియో స్క్రీన్లపై ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థినులు, యువతులు, మహిళలు ఈ అవగాహన సదస్సులో వర్చువల్ విధానంలో పాల్గొననున్నారు. ఈ సదస్సు కోసం గొల్లపూడి పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రోజు ఉదయం 10.30గంటలకు సీఎం జగన్ గొల్లపూడి పంచాయతీకి చేరుకుంటారు.
అక్కడ మొక్కలు నాటిన అనంతరం.. ఐదుగురు మహిళలతో వారి మొబైల్ ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేయిస్తారు. అన్ని జిల్లాల్లో విద్యార్థినులు, మహిళలతో నిర్వహించే దిశ యాప్ డౌన్‌లోడ్ కార్యక్రమాన్ని ఆయన వర్చువల్ విధానంలో వీక్షించనున్నారు. విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలి, పోలీసు వ్యవస్థ వెంటనే ఎలా స్పందించి రక్షణ కల్పిస్తుందన్నది వీడియో స్క్రీన్లపై ప్రదర్శించి వివరిస్తారు.