నాపై పెట్టిన కేసు చెల్లదు, కొట్టివేయండి..హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్
ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.
By Knakam Karthik Published on 6 March 2025 7:31 AM IST
నాపై పెట్టిన కేసు చెల్లదు, కొట్టివేయండి..హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్
ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా తీశానని, ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమంలో పెట్టాననే ఆరోపణలతో మంగళగిరికి చెందిన బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసిందన్నారు.
రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు నమోదు చేశారని, ఆరోపణలన్నీ నిరాధారమైనవని ఆర్జీవీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్ రాజీ చేశాక 2019లో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు మూవీ రిలీజ్ చేశామన్నారు. దీనిపై 2024లో కేసు నమోదు చేయడంలో అర్థం లేదన్నారు. సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు చెల్లవని, ఈ కేసు ఆధారంగా తీసుకోబోయే తదుపరి చర్యలన్నింటినీ నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు.
ఇదే కేసులో అంతకుముందు దర్శకుడు ఆర్జీవీకి గుంటూరు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మూవీపై నమోదైన కేసులకు సంబంధించి వర్మకు మరోసారి నోటీసులు ఇచ్చారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమా ఉందంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గతంలోనే అనకాపల్లి, మంగళగిరి, ఒంగోలులో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే విచారణకు రావాలని ఆర్జీవీకి సీఐడీ అధికారులు నోటీసులు పంపారు. దాంతో సీఐడీ నోటీసులు సవాల్ చేస్తూ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.