సంగం డెయిరీ అక్రమాల వ్యవహారంలో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. జైలులో ఉన్న ఆయన జ్వరం, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతుండడంతో.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, ఆయన తరపు లాయర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు నరేంద్రకు ప్రైవేటు ఆస్పత్రిలో టెస్టులు చేయించి, చికిత్స అందించాలని జైలు అధికారులను ఆదేశించింది.
కోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఇదే కేసులు నిందితుడిగా ఉన్న సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకు కరోనా వచ్చింది. ఆయన కూడ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇక ఏపీలో బుధవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. 1,16,367 శాంపిల్స్ పరీక్షించగా 22,204 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 85 మంది మృతి చెందగా.. 11,128 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12,06,232 కి చేరగా యాక్టివ్ కేసులు 1,70,588 గా ఉన్నాయి. ఇక, ఇప్పటి వరకు 10,27,270 కరోనా నుంచి కోలుకోగా 8,374 మంది ప్రాణాలు కోల్పోయారు.