సంచలన వ్యాఖ్యలు చేసిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
ఎన్నికల్లో అసలు ఓడిపోతామని ఊహించని వ్యక్తుల్లో
By Medi SamratPublished on : 7 Jun 2024 6:50 PM IST

ఎన్నికల్లో అసలు ఓడిపోతామని ఊహించని వ్యక్తుల్లో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కూడా ఒకరు. ఆయన సోషల్ మీడియాలో చాలా పాపులర్. అలాంటి వ్యక్తి ఓటమి చెందారని తెలిసి చాలా మంది షాక్ కు గురవుతున్నారు. బీజేపీ నేత సత్యకుమార్ చేతిలో కేతిరెడ్డి ఓడిపోయారు. 9వ రౌండ్ వరకు 11 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్న కేతిరెడ్డి.. ఆ తర్వాత 3734 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు.
తాజాగా ఆయన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రికి మధ్య చోటు చేసుకున్న విషయాలను బయట పెట్టారు. సీఎం చాంబర్ బయట చాలాసార్లు మంత్రులు, ఎమ్మెల్యేలు పడిగాపులు కాయడం చూశానన్నారు.. సీఎంకు, లోపల ఎవడో కూర్చుని మాట్లాడుతుంటాడని.. బయట వేచిచూస్తున్న వాళ్లు తమ బాధను ఎవరితోనూ చెప్పుకోలేరన్నారు. ముఖ్యమంత్రికి, ప్రజాప్రతినిధులకు మధ్య సీఎంవో వాళ్లు ఓ గ్యాప్ ను సృష్టించారని.. దాంతో ప్రజాప్రతినిధులు సమస్యలను నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి లేకపోయిందన్నారు. ధర్మవరంలో ఓ ఫ్లై ఓవర్ భూసేకరణ కోసం 100 సార్లు సీఎంవో చుట్టూ తిరిగానన్నారు. ప్రజలకు సంబంధించిన పనుల కోసం మేం వాళ్ల వెంటపడి తిరగాల్సి వచ్చేదన్నారు. సీఎంవోకు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ వల్లే ఓడిపోయామని చెప్పను కానీ... ముఖ్యమంత్రితో ఎమ్మెల్యేల సంబంధాలను మాత్రం సీఎంవో వాళ్లు చెడగొట్టగలిగారని కేతిరెడ్డి అన్నారు. ఎన్నికల ఫలితాలను చూస్తుంటే బాధ కలుగుతుందని, అసలు అభ్యర్థి ఎవరో కూడా తెలియకుండా ఓటేశారన్నారు.
సీఎం జగన్ ని కలవడానికి వెళ్లిన ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉండేదని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయన్ను ఊహల్లో ఉంచారని, ధనుంజయ్ రెడ్డి లాంటి చెత్త అధికారి సీఎం లా వ్యవహరించే వాడని జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story