శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లిలో శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మాఘమాసం రథసప్తమి సందర్భంగా నిజరూప దర్శనంలో భక్తులకు సూర్యభగవానుడు కనువిందు చేస్తున్నాడు. ఏడాదికి ఒక రోజు నిజరూపంలో దర్శనమిస్తున్న తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు నిన్న రాత్రి 8 గంటల నుంచి వేల మంది క్యూ లైన్లలో వేచి ఉన్నారు. భక్తులు, వీఐపీలతో అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయం కిటకిటలాడుతోంది.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. భక్తుల ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మాఘ మాసంలో శుక్లపక్ష సప్తమి తిథిలో అదితి - కశ్యపులకు సూర్య భగవానుడు సంతానంగా ఆవిర్భవించిన రోజునే రథసప్తమిగా జరుపుకొంటారు. ఈ రోజున నీటిలో శాలిధాన్యం, నువ్వులు, అక్షతలు, చందనం కలిపి తలమీద 7 జిల్లేడు ఆకులు, రేగుపళ్లు ఉంచుకుని స్నానం చేయాలని గర్గ మహాముని తెలిపారు. దీంతో దీర్ఘకాలిక చర్మవ్యాధులు తొలగుతాయని నమ్మిక. స్త్రీలు చిక్కుడు కాయలతో సూర్యరథం ముగ్గువేసి సూర్యుడిని ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది.