మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దేవినేని ఉమా తండ్రి శ్రీమన్నారాయణ కన్నుమూశారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో కన్నుమూశారని కుటుంబసభ్యులు తెలిపారు. కంకిపాడు మండలం నెప్పల్లి శ్రీమన్నారాయణ స్వగ్రామం కాగా.. కంకిపాడులో స్థిరపడ్డారు. ఆయనకు నలుగురు కుమారులు, ఓ కుమారై సంతానం. ఈ రోజు కంచికచర్లలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శ్రీమన్నారాయణ మృతికి పలువురు టీడీపీ నాయకులు, ఇతర పార్టీల నాయకులు సంతాపం తెలియజేశారు. శ్రీమన్నారాయణ మరణవార్త విన్న దేవినేని అవినాష్ వెంటనే విజయవాడలోని ఆస్పత్రికి వెళ్లి నివాళులర్పించారు.
చంద్రబాబు సంతాపం..
శ్రీమన్నారాయణ మృతికి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సంతాపం తెలియజేశారు. శ్రీమన్నారాయణ మృతి బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. దేవినేని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని చంద్రబాబు తెలియజేశారు.