తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ పై ముఖ్యమంత్రి జగన్ మాటలను మార్ఫింగ్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని వైసీపీ లీగల్ సెల్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు నారాయణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసును సవాల్ చేస్తూ హైకోర్టులో దేవినేని ఉమ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. సీఐడీ విచారణకు హాజరు కావాలని ఉమను ఆదేశించింది. ఇదే సమయంలో ఆయన్ను అరెస్ట్ చేయకూడదని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆయన మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి ఆయన వచ్చారు. ఉమ విచారణకు హాజరుకావడంతో సీఐడీ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై తప్పుడు కేసులు బనాయించారన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అక్రమ కేసులపై కోర్టుల్లో పోరాడతానని చెప్పారు. ఇక కరోనా విజృంభిస్తున్నా సీఎం పట్టించుకోకుండా.. పాలనను గాలికి వదిలి వేశారన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు. తనను జైల్లో పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటానని తెలిపారు. ఇక ధూళిపాళ్ల నరేంద్ర చేసిన తప్పేంటని ప్రశ్నించారు. అమూల్ కోసం సంగం డెయిరీ ఆస్తులను తాకట్టు పెట్టాలనే ప్రయత్నం చేస్తన్నారని ఆరోపించారు. ప్రభుత్వ మెప్పు కోసం కొందరు అధికారులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.