డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. 10 రోజుల్లోనే మిస్సింగ్ కేసు చేధించిన పోలీసులు

పోలీసులు మనసుపెట్టి సవాల్‌గా తీసుకుని ఏ కేసునైనా విచారణ చేపడితే ఎలాంటిదైనా త్వరగానే చేదించగలరు.

By Srikanth Gundamalla  Published on  3 July 2024 6:35 AM IST
deputy cm pawan, order, missing case, Andhra Pradesh,

డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. 10 రోజుల్లోనే మిస్సింగ్ కేసు చేధించిన పోలీసులు

పోలీసులు మనసుపెట్టి సవాల్‌గా తీసుకుని ఏ కేసునైనా విచారణ చేపడితే ఎలాంటిదైనా త్వరగానే చేదించగలరు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో అదే రోజువు అయ్యింది. 9 నెలల కిందట విజయవాడలో యువతి అదృశ్యం అయ్యింది. ఆమెను కనిపెట్టడంలో ఇన్నాళ్లు పోలీసులు నిర్లిప్తంగా ఉన్నారు. కానీ.. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. జూన్‌ 22న మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ ప్రజాదర్బార్‌ నిర్వహించారు. తమ కుమార్తె ఆచూకీ తెలియక 9 నెలలు అవుతోందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయిందని భీమవరానికి చెందిన శివకుమారి అనే మహిళ ప్రజాదర్బార్‌లో ఫిర్యాదు చేశారు.

సీరియస్‌గా స్పందించిన డిప్యూటీ సీఎం పవన్.. పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మాచవరం సీఐ గుణరాముకు ఫోన్‌ చేసి మాట్లాడారు. దర్యాప్తు వేగవంతం చేసి, యువతి ఆచూకీ కనిపెట్టాలని ఆదేశించారు. దీంతో విజయవాడ నగర సీపీ పీహెచ్‌డీ రామకృష్ణ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దాంతో.. రంగంలోకి దిగిన పోలీసులు యువతి ఆచూకీని పది రోజుల్లోనే కనిపెట్టారు.

భీమవరం పట్టణానికి చెందిన ప్రభాకర్‌రావు, శివకుమారి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్నమ్మాయి తేజస్విని విజయవాడలో తమ పెద్దమ్మ ఇంట్లో ఉంటూ మాచవరంలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదువుతోంది. అదే కళాశాల సీనియర్‌ విద్యార్థి, విజయవాడ శివారు నిడమానూరుకు చెందిన అంజాద్‌ అలియాస్‌ షన్ను ప్రేమ పేరుతో తేజస్వినిని లోబరుచుకున్నాడు. గతేడాది అక్టోబర్‌ 28న రాత్రి వీరిద్దరూ హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడ పలు ప్రాంతాల్లో తిరిగారు. ఆ తర్వాత వారి వద్ద డబ్బుల్లేక ఫోన్లు, నగలు అమ్మేశారు. ఇక కేరళ, ముంబై, ఢిల్లీ అంతా తిరిగారు. చివరకు జమ్మూకశ్మీర్‌కు చేరుకున్నారు. అక్కడ హోటల్‌లో అంజాద్‌ పనికి కుదిరాడు.

తేజస్వినికి ఫోన్‌ కూడా ఇచ్చేవాడు కాదని పోలీసులు తెలిపారు. ఓ రోజు అంజాద్ లేని సయంలో అతని ఫోన్ నుంచే తేజస్విని తన అక్కకు ఇన్‌స్టాలో మెసేజ్ పెట్టింది. ఆ చిన్న ఆదారంతో పోలీసులు కేసును చేధించారు. పోలీసు బృందాలు జమ్ముకి వెళ్లి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. బుధవారం మధ్యాహ్నానికి విమానంలో వారిని విజయవాడ తీసుకురానున్నారు. తమ కుమార్తె ఆచూకీ లభించడంతో తేజ్విని తల్లిదండ్రులు డిప్యూటీ సీఎం పవన్‌, సీపీ రామకృష్ణకు కృతజ్ఞతులు తెలుపుతున్నారు. ఇక ఇదే కేసులో సీపీ రామకృష్ణ .. డిప్యూటీ సీఎం పవన్ తో మాట్లాడారు. కిడ్నాప్‌ కేసా అంటూ ఆరా తీశారు. విజయవాడ వచ్చిన తర్వాత వివరాలను సేకరిస్తామని పోలీసులు పవన్ కల్యాణ్‌తో చెప్పారు.

Next Story