చికెన్ తిన‌డం తగ్గించండి.. కోళ్లు, గుడ్లు పూడ్చేయండి: క‌లెక్ట‌ర్‌

తూర్పు గోదావరి జిల్లాలో బ్రాయిలర్‌ కోళ్ల మృతిపై కలెక్టర్‌ ప్రశాంతి స్పందించారు. పెరవలి మండలం కానూరులోని ఓ పౌల్ట్రీఫామ్‌ శాంపిల్స్‌ను పరీక్షించగా బర్డ్‌ఫ్లూగా నిర్దారణ అయిందని తెలిపారు.

By అంజి  Published on  11 Feb 2025 7:05 AM IST
broiler chickens, East Godavari district, Collector Prashanthi, people, Poultryfarm, bird flu

అక్కడ బర్డ్‌ఫ్లూ.. చికెన్‌ తినడం తగ్గించండి: తూ.గో కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లాలో బ్రాయిలర్‌ కోళ్ల మృతిపై కలెక్టర్‌ ప్రశాంతి స్పందించారు. పెరవలి మండలం కానూరులోని ఓ పౌల్ట్రీఫామ్‌ శాంపిల్స్‌ను పరీక్షించగా బర్డ్‌ఫ్లూగా నిర్దారణ అయిందని తెలిపారు. కానూరు చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలోని పౌల్ట్రీలు, చికెన్‌ షాపులు క్లోజ్‌ చేయాలని, కోళ్లు, గుడ్లను పూడ్చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజల్లో బర్డ్‌ ఫ్లూ లక్షణాలపై సర్వే చేయాలన్నారు. కొన్ని రోజులు ప్రజలు చికెన్‌ తినడం తగ్గించాలని సూచించారు. అగ్రహారం గ్రామంలో ఒక కిలోమీటరు మేర రెడ్‌ జోన్‌గా, 10 కిలోమీటర్ల పరిధిలో సర్వేలెన్స్‌ జోన్‌గా ప్రకటించామన్నారు. 144, 133 సెక్షన్లు అమల్లోకి తెచ్చినట్టు తెలిపారు. ఎక్కడైనా పక్షలు చనిపోతున్నా విషయం తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోలు రూమ్‌ ఏర్పాటు చేశామని, అక్కడ 9542908025 నంబర్‌లో డాక్టర్‌ భరత్‌ అందుబాటులో ఉంటారని చెప్పారు.

కానూరు పరిధిలోని పౌల్ట్రీఫామ్‌లో బర్డ్‌ఫ్లూ సోకడంతో ఇప్పటి వరకు సుమారు 62 వేల కోళ్లు మృతిచెందాయి. చనిపోయిన 3 కోళ్ల శాంపిల్స్‌ను మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న నేషనల్‌ హైసెక్యూరీటీ డిసీజ్‌ డయాగ్నోసిస్‌ లేబొరేటరీకి పంపించారు. అక్కడ చేసిన పరీక్షల్లో రెండింటికి బర్డ్‌ఫ్లూ (హెచ్‌5ఎన్‌1) వైరస్‌ నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం యంత్రాంగం అలర్ట్‌ అయ్యింది. సీతానగరం మండలం మిర్తిపాడు, నల్లజర్ల, చాగల్లు మండలాల్లో ఉన్న ఫారాల్లో కూడా కోళ్లు చనిపోతున్నట్టు సమాచారం. అటు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని బాదంపూడి, తణుకు సమీపంలోని వేల్పూరులో కూడా బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపించడంతో శాంపిల్స్‌ తీసి పరీక్షలకు పంపించారు. బర్డ్‌ ఫ్లూ కలకలంతో చికెన్‌, గుడ్లు తినడానికి ప్రజలు భయపడుతున్నారు. ఇది చికెన్‌ మార్కెట్‌పై ప్రభావం చూపిస్తోంది.

Next Story