బెడిసికొట్టిన ప్రేమ..ఇంటికెళ్లి మరీ కత్తితో దాడిచేసిన యువతి తల్లి

ఎన్టీఆర్‌ జిల్లా పెనమలూరు మండలం కానూరులో దారుణం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  5 Sept 2023 11:15 AM IST
Crime, Woman attack,  knife, daughter Boyfriend,

బెడిసికొట్టిన ప్రేమ..ఇంటికెళ్లి మరీ కత్తితో దాడిచేసిన యువతి తల్లి

ఎన్టీఆర్‌ జిల్లా పెనమలూరు మండలం కానూరులో దారుణం చోటుచేసుకుంది. కానూరులోని సనత్‌నగర్‌కు చెందిన లంకే నాగరాజు ఆటోనగర్‌లో లారీ బాడిబిల్డింగ్ వర్క్‌షాపులో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. ఆరేళ్ల క్రితం..ఓ యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే..ఆమె ప్రస్తుతం లా చదువుతోంది. విద్యార్థినితో ప్రేమ వ్యవహారం నడిపించాడు నాగరాజు. ఇటీవల విద్యార్థిని మనసు మార్చుకుంది. బాగా చదువుకుని.. మంచి ఉద్యోగం సంపాదించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. దాంతో.. తనని మర్చిపోవాలంటూ నాగరాజుని కోరింది యువతి. దానికి నాగరాజు నిరాకరించాడు. ఫోన్లో ఉన్న ఫొటోలు, మెసేజ్‌లు తీసేయాల్సిందిగా కోరింది. అన్నింటికీ నాగరాజు నిరాకరించాడు.

అయితే.. యువతి ఈ విషయం తన తల్లితో చెప్పింది. ఇక ఎలాగైనా ఫొటోలు డెలీట్ చేయించాలనే ఉద్దేశంతో.. తల్లితో కలిసి నాగరాజు ఇంటికి వెళ్లింది యువతి. ఈ నెల 2న అర్ధరాత్రి నాగరాజు ఇంటికి వెళ్లారు ఇద్దరూ. తన కుమార్తె స్నేహితుడిగా భావిస్తోందని.. ఫొటోలు, మెసేజ్‌లు డెలీట్‌ చేయాలని చెప్పింది యువతి తల్లి. తన కుమార్తె ఎంతో బాధపడుతోందని.. ఏడుస్తోందని ఇలా చేయకు అంటూ చెప్పింది. నాగరాజు తాను మెసేజ్‌లు డెలీట్‌ చేయనని చెప్పడంతో.. ఆగ్రహానికి గురైన యువతి తల్లి ఫోన్‌ లాక్కుని కత్తితో దాడి చేసింది. దాంతో భాయాందోళనకు గురైన నాగరాజు పెద్దగా కేకలు వేశాడు. అతని అరుపులతో తల్లీ, కూతురు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక స్థానికులు నాగరాజు కేకలు విని వెంటనే స్పందించారు. అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నాగరాజు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పెనమలూరు పోలీసులు.. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Next Story