విద్యుత్ కొనుగోళ్లలో ఎంత ఆదా చేశారో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోళ్లలో ఆదా చేసినప్పుడు పదేపదే ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 28 మాసాల కాలంలో దాదాపు రూ.9 వేల కోట్ల మేర విద్యుత్ చార్జీల భారాన్ని ప్రజలపై మోపిందని.. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో మరో రూ.3699 కోట్ల గుదిబండ ప్రజలపై వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బొగ్గు నిల్వలు లేకపోవటం వల్ల ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ.. 24 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దోబూచులాటలు కట్టిపెట్టాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచి బొగ్గు సరఫరా అయ్యే విధంగా చూడాలని కోరారు.