భూమిని నమ్ముకున్న ఆ దంపతులకు వ్యవసాయం కలిసిరాలేదు. వ్యవసాయం కోసం చేసిన అప్పులను తీర్చే మార్గం కనిపించక ఆత్మహత్యే శరణ్యం అని బావించారు. ఫిబ్రవరి 7న భార్య ఆత్మహత్య చేసుకోగా.. మార్చి 11( గురువారం ) భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో వారి ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా ఆగళ్లడ్డలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆళ్లగడ్డ మండలం చింతకుంటలో ఉండే సంజీవరెడ్డి(30)కి ఏడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన శ్రావణితో పెళ్లి జరిగింది. వీరికి వ్యవసాయమే జీవనాధారం. ఈ దంపతులకు తేజస్విని(5), అశ్విని(3), సాయి తేజస్వి(4 నెలలు) సంతానం.
కౌలుకు భూమిని తీసుకుని వ్యవసాయం చేసేవారు. ఈ సంవత్సరం మునుగుత్త( పంట వేసే ముందే కౌలు ఇవ్వడం) ఇచ్చి పత్తి వేశారు. వాతావరణం అనుకూలించపోవడంతో పంట దిగుబడి రాలేదు. గత రెండేళ్లుగా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. మరోవైపు వ్యవసాయం కోసం తెచ్చిన అప్పులు రూ.11లక్షలకు చేరాయి. వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలా అని ఆ దంపతులు నిత్యం మదనపడేవారు. భర్త పడే బాధను చూడలేక శ్రావణి ఫిబ్రవరి 7న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. భార్య చనిపోవడంతో సంజీవరెడ్డి తీవ్రంగా కుంగిపోయాడు.
గురువారం డాబాపైకి వెళ్లి పురుగుల మందు తాగాడు. అనంతరం కిందకు వచ్చి తల్లి వెంకటలక్ష్మమ్మతో అమ్మా అప్పులు ఎక్కువయ్యాయి. తీర్చే మార్గం కనిపించడం లేదు. నమ్మిన వ్యవసాయం కాటేసింది. నేను చచ్చిపోతున్నా.. పిల్లలు జాగ్రత్త అని చెప్పి కుప్పకూలిపోయాడు. వెంటనే ఆ తల్లి కుమారుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. నెలరోజుల వ్యవధిలోనే భార్య భర్తలు మృతి చెందడంతో వారి ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.