ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నా.. జనవరి నుంచి కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఇండియాలో కరోనా టీకా అందుబాటులోకి రాబోతున్నది. అన్ని రాష్ట్రాలు టీకా పంపిణీకి సిద్ధంగా ఉండాలని ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయంలో ఏపీ ప్రజలకు ఎంపీ విజయసాయిరెడ్డి శుభవార్త చెప్పారు. డిసెంబర్ 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేయబోతున్నట్లు ఆయన చెప్పారు.
డిసెంబరు 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చే బృహత్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు 4,762 ఆరోగ్య కేంద్రాల్లో వాక్సినేషన్ జరుగుతుంది. కోటికి పైగా టెస్టులు నిర్వహించి వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో రాష్ట్రం విజయం సాధించింది' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఏ వాక్సిన్‌ను ఇవ్వనున్నారు అనేది విషయాన్ని చెప్పలేదు.
ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 8,76,336కి చేరాయి. కొత్తగా 5గురు కరోనాతో మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 7,064కి చేరింది. 8,64,612 మంది కరోనా నుండి కోలుకోగా.. 4,660 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,09,37,377 మందికి కరోనా పరీక్షలు చేశారు.