కరోనా మహమ్మారి పలువురు నాయకులను వదలడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా విజృంభణ ఓ వైపు కొనసాగుతూ ఉంది. తాజాగా తెలుగుదేశం పార్టీలో కరోనా టెన్షన్ పట్టుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఇటీవలి కాలంలో సన్నిహితంగా ఉన్న వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. శ్రీకాళహస్తి పార్టీ ఇన్చార్జి బొజ్జల సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో.. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు.

ఈ నెల 8న శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. మాస్క్ ధరించకుండానే చంద్రబాబుతో సుధీర్ రెడ్డి మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది. చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఆయన పక్కనే నిలబడ్డారు కూడానూ..! ఇప్పుడు ఆయన కరోనా బారిన పడటంతో చంద్రబాబు గురించి పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

చంద్రబాబు నేడు తిరుపతిలో ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన చంద్రబాబు ప్రస్తుతం వెంకటగిరిలో ఉన్నారు. సాయంత్రం 4.30 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుంటారు. రాత్రి 7.30 గంటల వరకూ ఆయన రోడ్ షో నగరంలో జరుగనుంది. ఆపై కృష్ణాపురం ఠాణా జంక్షన్ లో ఆయన ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం రాత్రి 8.30 గంటల వరకూ సాగనుంది. మాజీ ఎమ్మెల్యే, మహిళా నేత సుగుణమ్మ క్యాంపు కార్యాలయానికి చేరుకుని చంద్రబాబు, అక్కడ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. ఇప్పుడు చంద్రబాబుతో కలిసి తిరిగిన సుధీర్ రెడ్డికి కరోనా సోకినట్లుగా వార్తలు రావడంతో.. తిరుపతి పర్యటనపై సందిగ్ధత నెలకొంది.


సామ్రాట్

Next Story