మధ్యాహ్న భోజన పథకంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్లారిటీ ఇచ్చిన గరికపాటి!
మధ్యాహ్న భోజన పథకంపై ప్రముఖ తెలుగు పండితుడు గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా...
By - అంజి |
మధ్యాహ్న భోజన పథకంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్లారిటీ ఇచ్చిన గరికపాటి!
మధ్యాహ్న భోజన పథకంపై ప్రముఖ తెలుగు పండితుడు గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితంగా, పేద విద్యార్థుల పట్ల సున్నితత్వం లేకుండా ఉన్నాయని విద్యార్థి నేతలు మండిపడ్డారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు అందుతున్న మధ్యాహ్న భోజనంపై ఇటువంటి విమర్శలు చేయడం క్షమించరాని నేరమని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి. రామ్మోహన్, కార్యదర్శి కె. ప్రసన్న కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గరికపాటి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
మధ్యాహ్న భోజన పథకం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరగడమే కాకుండా, మధ్యలో బడి మానేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని అనేక అధ్యయనాలు నిరూపించాయని నేతలు గుర్తు చేశారు. కేవలం గుడ్ల కోసమే పిల్లలు బడికి వస్తున్నారని, దీనివల్ల విద్య అర్థరహితమైపోతోందని గరికపాటి అనడం విద్యార్థుల గౌరవాన్ని, వారి కుటుంబాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని వారు ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో పోషకాహార లోపం తీవ్రంగా ఉన్న తరుణంలో.. పిల్లలకు ఆహారం, పుస్తకాలు, యూనిఫాంలు అందించే వ్యవస్థను విమర్శించడం ఏమాత్రం సమంజసం కాదని వారు హితవు పలికారు.
మరోవైపు, కుల వ్యతిరేక పోరాట సమితి (KVPS) నాయకులు కూడా గరికపాటి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. గరికపాటి గర్వంతో కళ్లు మూసుకుపోయి మాట్లాడుతున్నారని, పాఠశాల విద్యార్థులను కించపరిచేలా మాట్లాడినందుకు ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. మాల్యాద్రి మాట్లాడుతూ.. గరికపాటి ఒక బహిరంగ వేదికపై బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరారు. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉండి, పేద పిల్లల తిండిపై విమర్శలు చేయడం తగదని ఆయన పేర్కొన్నారు.
అటు దీనిపై గరికపాటి టీమ్ స్పందించింది. రాజమండ్రిలో జరిగిన తెలుగు మహాసభలో గరికపాటి మధ్యాహ్న భోజనం పథకంపై విమర్శ చేసినట్టు వస్తున్న వీడియో వక్రీకరించారని ఆయన టీం తెలిపింది. ఆ సభలో గురువు గారు అలా మాట్లాడలేదని, వేరే సందర్భంలో వేరే ఉద్యేశ్యంతో మాట్లాడిన మాటలను కలగలిపి ఈ వీడియోకి జతచేసి వ్యతిరేక అర్థం వచ్చేలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన టీం వివరించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన ఇక్కడ ఉంది.