Andhra Pradesh : రూ. 194 కోట్ల‌తో 100 ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల భ‌వ‌నాల‌ నిర్మాణం

రాష్ట్రంలో రూ. 194 కోట్ల వ్య‌యంతో 100 ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌(పిహెచ్‌సిలు) నిర్మాణం జ‌రుగుతోంద‌ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ తెలిపారు.

By -  Medi Samrat
Published on : 17 Feb 2026 4:14 PM IST

Andhra Pradesh : రూ. 194 కోట్ల‌తో 100 ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల భ‌వ‌నాల‌ నిర్మాణం

రాష్ట్రంలో రూ. 194 కోట్ల వ్య‌యంతో 100 ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌(పిహెచ్‌సిలు) నిర్మాణం జ‌రుగుతోంద‌ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్ప‌టికే 1144 ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు(పిహెచ్‌సిలు) ప‌నిచేస్తున్నాయ‌ని, వాటికి సొంత భ‌వ‌నాలున్నాయ‌ని మంత్రి తెలిపారు. మ‌రో 88 పీహెచ్సీల‌ను మంజూరు చేశామ‌ని, వాటి నిర్మాణాలు వివిధ ద‌శ‌ల్లో ఉన్నాయ‌ని చెప్పారు. శాస‌న మండ‌లిలో మంగ‌ళ‌వారం ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల భ‌వ‌నాలకు సంబంధించి ప‌లువురు స‌భ్యులడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి స‌మాధానం చెప్పారు. 12 పీహెచ్సీల‌కు కొత్త భవనాలు అవసరమని గుర్తించామ‌ని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. గ్రామీణ పేదలకు విస్తృతమైన వైద్య సేవల్ని అందించేందుకు ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్ని మరింత ప‌టిష్టం చేశామ‌న్నారు. 976 పిహెచ్సీ భ‌వ‌నాల‌కు పూర్తి స్థాయిలో రిపేర్లు చేప‌ట్టామ‌ని, అలాగే 152 కొత్త పిహెచ్సీల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని మంత్రి వివ‌రించారు.

త్వ‌ర‌లో 110 మంది డాక్ట‌ర్ల నియామ‌కం

గ్రామీణ ప్రాంతాల్లో 1144 పీహెచ్‌సిలు, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 560 యుపిహెచ్‌సీలు ఉన్నాయ‌ని మంత్రి తెలిపారు. గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో సేవ‌ల్ని మ‌రింత చేరువ చేసేందుకు ఇటీవ‌ల‌ 2500 మంది డాక్టర్లు, పారా మెడిక‌ల్ సిబ్బందిని నియమించామ‌ని, మ‌రో 110 మంది డాక్టర్లను త్వ‌ర‌లో నియమించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని మంత్రి స‌భ‌కు తెలిపారు. వ్య‌క్తి ఆధారంగా (ఎల‌క్ట్రానిక్ హెల్త్ రికార్డు) ముంద‌స్తు ఆరోగ్య సంర‌క్ష‌ణా చ‌ర్య‌ల్ని(ప్రివెంటివ్ హెల్త్ కేర్‌) చేప‌ట్టాల‌న్న ఉద్దేశంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు 'సంజీవని' కార్యక్రమాన్ని తీసుకొచ్చార‌ని మంత్రి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ప‌టిష్టంగా అమ‌లు చేసేందుకు కావాల్సిన‌ సిబ్బంది నియామ‌కానికి టాటా ఎండి తోనూ, అదేవిధంగా టెక్నాల‌జీ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ కోసం గేట్స్ ఫౌండేష‌న్ తోనూ ప్ర‌భుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంద‌న్నారు. సంజీవ‌ని కార్య‌క్ర‌మం అమ‌లులో భాగంగా సిబ్బంది అంద‌రికీ శిక్ష‌ణ కూడా ఇచ్చామ‌న్నారు.

కొత్త‌గా 19 డ‌యాల‌సిస్ సెంట‌ర్లు మంజూరు చేశాం

పీహెచ్సీల్లో అవ‌కాశం ఉన్న‌చోట శిక్ష‌ణ పొందిన‌ డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ ప్ర‌స‌వాల్ని నిర్వ‌హిస్తున్నార‌ని మంత్రి తెలిపారు. ప్ర‌స‌వాలు చేసేందుకు అల్ట్రా స్కాన్లు, టిఫా స్కాన్ల అవసరముంటుంద‌ని, 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో (సిహెచ్‌సిల్లో) ఇవి జ‌రుగుతున్నాయ‌న్నారు. ప్రతి ఒక్కరి హెల్త్ రికార్డును డిజిట‌లైజ్‌ చేయాలనే ఉద్దేశంతో ఆయుష్మాన్ భార‌త్ డిజిట‌ల్ మిష‌న్ (ఏబిడిఎం) యూనిక్ ఐడీని కూడా క్రియేట్ చేస్తున్నామ‌న్నారు. 25 నెల‌ల్లో 19 డ‌యాల‌సిస్ సెంట‌ర్ల‌ను మంజూరు చేశామ‌ని మ‌రో ప్ర‌శ్న‌కు స‌మాధానంగా మంత్రి చెప్పారు. పిహెచ్సీల్లో డ‌యాల‌సిస్ సెంట‌ర్లు లేవ‌ని, సిహెచ్సీల్లోనే ఉన్నాయ‌ని మంత్రి స‌భ‌కు వివ‌రించారు.

Next Story