'ప్రజలను పాడె ఎక్కించడమా స్వర్ణాంధ్ర 2047 విజనా?.. కూటమి సర్కార్‌పై వైఎస్ షర్మిల ఫైర్
ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. పేదవాడికి సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని...
By - అంజి |
'ప్రజలను పాడె ఎక్కించడమా స్వర్ణాంధ్ర 2047 విజనా?.. కూటమి సర్కార్‌పై వైఎస్ షర్మిల ఫైర్
ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. పేదవాడికి సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, బకాయిలు చెల్లించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.
ఆరోగ్యశ్రీ బకాయిలు రూ. 3,000 కోట్లు చెల్లించడానికి మనసు లేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీ మెప్పు కోసం సభలు, ఉత్సవాలకు మాత్రం వందల కోట్లు తగలేస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. ఏడాది కాలంలో యోగాంధ్ర, జీఎస్టీ ఉత్సవాలు, ఇతర విలాసాల కోసం దాదాపు రూ. 1,200 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం, పేదల వైద్యం కోసం నిధులు విడుదల చేయకపోవడం సిగ్గుచేటని పేర్కొంది. అమరావతి కోసం లక్షల కోట్ల అప్పులు తెస్తున్న ప్రభుత్వానికి, ఆరోగ్యశ్రీకి ఇచ్చేందుకు చిల్లిగవ్వ లేదా అని ప్రశ్నించింది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం 'అనారోగ్యశ్రీ'గా మారుస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. 'యూనివర్సల్ హెల్త్ స్కీమ్' ముసుగులో ఈ పథకాన్ని ప్రైవేటుపరం చేసే కుట్ర జరుగుతోందని మండిపడింది. రెండేళ్ల పాలనలో రెండుసార్లు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని, వైద్యం అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ఇదేనా మీ 'స్వర్ణాంధ్ర 2047 విజన్' అని నిలదీసింది.
బడ్జెట్‌లో ఎన్టీఆర్ వైద్య సేవ కోసం రూ. 4,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, నిధుల విడుదలకు ఎందుకు అభ్యంతరం చెబుతోందని కాంగ్రెస్ ప్రశ్నించింది. వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చలు జరిపి, రూ. 3,000 కోట్ల బకాయిలను విడుదల చేసి వైద్య సేవలను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో ప్రజారోగ్యం కోసం రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అల్టిమేటం జారీ చేసింది.